వీసాలపై పాకిస్థాన్ కు అమెరికా షాక్

వీసాలపై పాకిస్థాన్ కు అమెరికా షాక్

పుల్వామా ఉగ్రవాద దాడి తర్వా ప్రపంచ దేశాలన్నిటి దిగ్బంధంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు మరో పెద్ద షాక్ తగిలింది. అమెరికా తమ దేశానికి వచ్చే పాకిస్థానీలకు ఇచ్చే వీసా కాలపరిమితిని బాగా తగ్గించేసింది. మునుపు పాకిస్థానీ పౌరులకు జారీ చేసే ఐదేళ్లకు వీసా వ్యవధిని 12 నెలలకు తగ్గించింది.

పాకిస్థానీ వార్తాపత్రిక ద ట్రిబ్యూన్ ప్రకారం పాకిస్థాన్ లోని అమెరికా రాయబారి ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం అందించారు. కొత్త నియమాల ప్రకారం పాకిస్థానీ విలేకరులు, మీడియా వ్యక్తులకు అమెరికా వెళ్లడం మరింత కఠినతరం కానుంది. వారికి జారీ చేసే వీసా కాలపరిమితిని 3 నెలలు చేశారు.

అమెరికా వీసా కాలపరిమితి తగ్గించడమే కాకుండా వీసాలకు దరఖాస్తు చేసే ఫీజుని కూడా బాగా పెంచేసింది. అంటే ఇకపై ఎవరైనా పాకిస్థానీ పౌరుడు అమెరికా వెళ్తే 12 నెలల కంటే ఎక్కువ కాలం అక్కడ ఉండరాదు. అంత కంటే ఎక్కువ సమయం ఉంటే పాకిస్థాన్ వచ్చి వీసా రెన్యూ చేసుకోవాలి.

కొత్త ఆదేశాల ప్రకారం వర్క్ వీసా, జర్నలిస్ట్ వీసా, ట్రాన్స్ ఫర్ వీసా, ధార్మిక వీసాల ఫీజును పెంచారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న వీసా ఫీజును 32 డాలర్ల నుంచి 38 డాలర్లకు పెంచారు. అంటే ఇప్పుడు ఎవరైనా పాకిస్థానీ విలేకరి అమెరికా వెళ్లాలనుకుంటే వీసా అప్లయ్ చేయడానిక 192 డాలర్లు చెల్లించాలి. కొన్ని మిగిలిన కేటగిరీల్లో 198 డాలర్లని ఫీజుగా నిర్ణయించారు. అమెరికా ద్వారా జారీ అయిన గణాంకాల ప్రకారం 2018లో సుమారు 38,000 మంది పాకిస్థానీలకు అమెరికా వీసా ఇచ్చేందుకు నిరాకరించింది.