కరోనా విజృంభణ.. బైడెన్‌ ఆందోళన

కరోనా విజృంభణ.. బైడెన్‌ ఆందోళన

కరోనా వైరస్‌ విషయంలో అమెరికా ఇప్పటికీ చావు బతుకుల రేసులోనే ఉందని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రజలను హెచ్చరించారు. తప్పనిసరిగా కరోనా వ్యాప్తిని నివారించేలా జాగ్రత్తలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 75 రోజుల్లో 150 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేసిందన్నారు. వర్జీనియాలోని ఓ వ్యాక్సినేషన్‌ కేంద్రం సందర్శన సందర్భంగా బైడెన్‌ తెలిపారు. తొలుత బైడెన్‌ ప్రభుత్వం వందరోజుల్లో వంద మిలియన్‌ డోసులు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 200 మిలియన్లకు పెంచుతూ నిర్దేశించారు. జులై 4వ తేదీలోపు మంచి రోజులు వస్తాయి. ఆలోపు ఎంతమందిని కాపాడుకుంటామనేది ముఖ్యం. కాబట్టి ప్రతిఒక్కరూ తమ వంతు వచ్చినపుడు టీకాలు వేయించుకోండి. మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించాలని బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 19 నుంచి దేశవ్యాప్తంగా వయోజనులందరికీ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి అర్హత కల్పిస్తామన్నారు. ఇంకా కొత్త కేసులు పెరగడం, ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరగడంపై బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు. 

మరోవైపు... కరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్‌ కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో రికార్డుస్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధికంగా 4 వేల 195 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమెరికా, పెరూలో మాత్రమే ఇప్పటివరకు ఒక్కరోజులో నాలుగు వేల మరణాలు సంభవించాయి. బ్రెజిల్‌లో ఇప్పటివరకు కోటీ 31 లక్షల మంది కొవిడ్‌ బారిన పడగా.. మహమ్మారి కాటుకు 3 లక్షల 37 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంక్షలను సడలించడమే వైరస్‌ ఉద్ధృతికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న 90 శాతం ఐసీయూల్లో కొవిడ్‌ రోగులే చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా బ్రెజిల్‌లో 3 శాతం మంది ప్రజలు కొవిడ్‌ టీకాలు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.