షాహిద్ తమ్ముడితో హిందీలో ఉప్పెన

షాహిద్ తమ్ముడితో హిందీలో ఉప్పెన

సూపర్ హిట్ సినిమా ఘుమఘుమలాడే వంటకం లాంటిది! ఒక ఇండస్ట్రీలో అది వర్కవుటైందంటే... పక్క సినిమా రంగాలన్నిటికి వాసన తగిలేస్తుంది! ఇప్పుడు ‘ఉప్పెన’ ఘుమఘుమలు అదే పని చేస్తున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లకి, టేస్టీ స్మెల్, పాకేస్తోంది! వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి, డైరెక్టర్ బుచ్చి బాబు... ఈ పేర్లు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగుతున్నాయి. కారణం... ‘ఉప్పెన’! ఊరించి, ఊరించి బాక్సాపీస్ వద్దకొచ్చిన ‘ఉప్పెన’... పేరు నిలబెట్టుకుంది. నిజంగానే కలెక్షన్ల ఉప్పెనతో పాటూ పొగడ్తలతో కూడిన రివ్యూల ఉప్పెన సృష్టిస్తోంది. మరి ఈ హంగామా అంతా ఇతర భాషల దర్శకనిర్మాతలు, హీరోల్ని ఆకట్టుకోకుండా ఉంటుందా? కోలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా మన ‘ఉప్పెన’ ఇప్పుడు ఇతర సినిమా రంగాల్ని కూడా ఊపేస్తోంది! ‘ఉప్పెన’ సూపర్ సక్సెస్ తో అనేక రీమేక్ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ విజయ్ కోలీవుడ్ వర్షన్ లో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఇళయదళపతి నట వారసుడికి మన ‘ఉప్పెనే’ ఫస్ట్ మూవీ అవుతుంది. మరోవైపు, బాలీవుడ్ లోనూ ఓ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ పాత్రలో కనిపించాలని ఉవ్విళ్లూరుతున్నాడట. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టార్ హీరోగా హిందీ ‘ఉప్పెన’ తెరకెక్కుతుందని ముంబై టాక్. అతడి సరసన అమేజింగ్ బ్యూటి అనన్య పాండే రెండో సారి నటించనుందని కూడా అంటున్నారు. ఇషాన్, అనన్య జంటగా ఇప్పటికే ‘ఖాళీ పీలీ’ సినిమా విడుదలైంది. యంగ్ కపుల్ బాగానే మార్కులు సంపాదించుకున్నారు. చూడాలి మరి, వీరిద్దరూ బాలీవుడ్ ‘ఉప్పెన’లో ఫైనలైజ్ అవుతారో లేదో...