కోర్టు మాదే.. మందిర్ తయారే

కోర్టు మాదే.. మందిర్ తయారే

ఉత్తరప్రదేశ్ కోపరేటివ్ మినిస్టర్ ముకుత్ బిహారీ వర్మ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాదే కాబట్టి అయోధ్యలో రాంమందిర నిర్మాణం ఖాయంగా జరుగుతుందన్నారు. విలేకరులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్న సందర్భంలో.. తమ పార్టీ రాంమందిర్ నిర్మిస్తుందన్న వాగ్దానం చేసిందని, దాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. ఆ కేసు సుప్రీంకోర్టులో హియరింగ్ లో ఉంది కదా అని ఓ విలేకరి ప్రస్తావించగా.. సుప్రీంకోర్టు మాదే కాబట్టి.. కేసు సుప్రీం విచారణలో ఉంది. జ్యుడీషియరీ మాదే. దేశం మాదే. గుడి కూడా మాదే.. అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల మీద విమర్శలు వెల్లువెత్తడంతో దాని మీద వర్మ మళ్లీ వివరణ ఇచ్చారు. నేనేమైనా పొరపాటు మాట్లాడానా? సుప్రీంకోర్టు మాదే అంటే ప్రజలందరిదనే కదా అర్థం. దేశమంతా మాదే అంటే అన్నీ మావేనని కదా.. అన్నారు. అయితే వర్మ వ్యాఖ్యల మీద విపక్షం సీరియస్ అవుతోంది. సమాజ్ వాదీ పార్టీ నేత తారిఖ్ సద్దిఖీ వర్మను సారీ చెప్పాలన్నారు. కోర్టులను ప్రజలంతా అత్యున్నతంగా భావిస్తే... వీళ్లు ఇంకోరకంగా భావిస్తున్నారని, బాధ్యతల్లో ఉన్న మంత్రులు ఇంత కేర్ లెస్ గా మాట్లాడితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.