యువరాజ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు...

యువరాజ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు...

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ఒకడు. సిక్సర్ కింగ్ గా పేరు సంపాదించుకున్న యువీ భారత జట్టుకు ''వరల్డ్ కప్ మ్యాన్'' గా కూడా నిలిచాడు. యువరాజ్ 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి 2017 లో వీడ్కోలు పలికాడు. కానీ గత ఏడాది 2020 లో మళ్ళీ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని దేశవాళీ క్రికెట్లో ఆడటానికి సిద్ధమయ్యాడు. అయితే టీ20 క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన ఈ సిక్సర్ కింగ్ గురించి ఎవరికీ తెలియని లేదా అతితక్కువ మందికి తెలిసిన కొన్ని నిజాలు మీకోసం...  

1. యువరాజ్ 1981వ సంవత్సరం 12వ నెల 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు పంజాబ్ రాష్ట్ర రాజధాని అయిన చంఢీఘర్ లోని 12వ సెక్టార్ లో ఉన్న ఆసుపత్రిలో జన్మించాడు. అందుకే యువీ లక్కీ నెంబర్ మరియు జెర్సీ నెంబర్ 12.

2. యువరాజ్ సింగ్ కు క్రికెట్ తన రక్తంలోనే ఉంది. ఎందుకంటే అతని తండ్రి యోగ్రాజ్ సింగ్ ఓ ఫాస్ట్ బౌలర్. ఆయన భారత జట్టుకు 1 టెస్ట్ మరియు 6 వన్డేలలో పరతినిధ్యం వహించాడు.

3. యువరాజ్ మొదట్లో ప్రొఫెషనల్ రోలర్ స్కేటర్ అవ్వాలనుకున్నాడు. వాస్తవానికి, అతను 11 ఏళ్ళ వయసులో జాతీయ అండర్ -14 రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ ను కూడా గెలుచుకున్నాడు. కానీ తర్వాత అతని తండ్రి యువీని క్రికెట్‌పై దృష్టి పెట్టమని కోరాడు.

4. యువరాజ్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు అద్భుతమైన క్రికెటర్ కాదు. యువరాజ్‌కు శిక్షణ ఇవ్వమని అతని తండ్రి యోగ్‌రాజ్ సింగ్ భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత రాజకీయనాకుడు అయిన నవజోత్ సిద్ధును కోరాడు. కానీ అతని ఆటను యువీ ఓ క్రికెట్ ఆటగాడు అవుతాడని నమ్మకం లేక సిద్దూ ఆశలు వదులుకున్నాడు.

5. 13 సంవత్సరాల వయస్సులో1995 సంవత్సరంలో యువరాజ్ పంజాబ్ U16 జట్టు తరపున అద్భుతమైన ప్రదర్శన చేసి పంజాబ్ U19 జట్టుకు ఎంపికయ్యాడు. అప్పుడే హిమాచల్ ప్రదేశ్ జట్టు పై అజేయంగా 137 పరుగులు చేశాడు. అలాగే 1996-97లో రంజీ ట్రోఫీలో ఒరిస్సా పై ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లోకి అరంగేట్రం చేశాడు.

6. డిసెంబర్ 1999లో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్లో బీహార్‌ పై పంజాబ్ U19  తరఫున ఆడుతున్న యువరాజ్ 404 బంతుల్లో 358 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 40 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

7. 2000 ఏడాదిలో మొహమ్మద్ కైఫ్ నాయకత్వంలో U19 ప్రపంచ కప్ సాధించిన జట్టులో యువీ కూడా ఒక్కడు.

8. 2003 లో ఇంగ్లాండ్ లో టీ20 క్రికెట్ ప్రారంభమైన తర్వాత... భారత జట్టు తరపున ఈ ఫార్మటు లో మొదటి అర్ధశతకం చేరిన ఆటగాడు యువరాజ్.

9. 2000 ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన యువీ 2003 లో బంగ్లాదేశ్‌ పర్యటనలో తన తొలి వన్డే సెంచరీని (85 బంతుల్లో 102 *) సాధించాడు.

10. భారత లెజెండ్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తర్వాత ప్ర‌ముఖ క్రికెట్‌ కౌంటీ జ‌ట్టు యార్క్‌షైర్‌ ఒప్పందం కుదుర్చుకున్న రెండో భారత ఆటగాడు భారత క్రికెటర్ యువరాజ్. ఈ ఒప్పందం కొంతమంది విదేశీ ఆటగాళ్లకు మాత్రమే ఇవ్వబడిన గౌరవం. అందులో యువీ ఒక్కడు.
  
11. 2007 టీ 20 ప్రపంచ కప్ లో యువీ ఇంగ్లాడ్ పై 12 బంతుల్లో 50 బాదిన విషయం అందరికి తెలుసు. కానీ ఆ తర్వాత సెమీస్ లో ఆస్ట్రేలియా పై  30 బంతుల్లో 70 పరుగులు చేసాడు. అలాగే ఆ టోర్నమెంట్ లోనే లాంగెస్ట్ సిక్స్ (119 మీటర్లు) బాదాడు.

12. భారత్ జట్టు 2011 లో వన్డే ప్రపంచ కప్ అందుకుంది అని అలాగే అందులో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నది చాలా ముందుకి తెలుసు. కానీ ఆ టోర్నీ సమయంలో యువీ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అని అంతే కాకుండా ఈ టోర్నీలో వెస్టిండీస్ తో ఆడుతున్న మ్యాచ్ లో అతను గ్రౌండ్ లోనే రక్తం కక్కుకొని కూడా సెంచరీ చేసినట్లు తక్కువ మందికి తెలుసు.

13. ఒకే ప్రపంచ కప్ లో 300 కు పైగా పరుగులు చేసి 15 వికెట్లు తీసిన మొదటి ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 

14. ప్రస్తుతం అత్యధికంగా ప్రాముఖ్యత సంపాదించుకున్న టీ 20 ఫార్మాట్ లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడు కూడా యువీనే.

15.  భారతదేశం మొత్తం యువరాజ్ కు అభిమానులు ఉంటె... యువరాజ్ మాత్రం స్వయంగా సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని. ఓ సారి గ్రౌండ్ లోనే యువీ సచిన్ కాళ్ళు మొక్కుతాడు.

16. క్యాన్సర్ వ్యతిరేకంగా యువరాజ్ చేసిన పోరాటం మనందరికీ తెలుసు, కానీ ఆ తర్వాత క్యాన్సర్ గురించి ఆవగాహన పెంచడానికి ‘యూవీకాన్’ అనే సంస్థను యువరాజ్ స్థాపించాడు.

17. క్యాన్సర్ నుండి కోలుకున్న తర్వాత యువరాజ్ తన ఆత్మకథ ''ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్: ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్''ఆ నే బుక్కును రాసాడు.

18. ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకు కూడా అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడి రికార్డు యువరాజ్ పేరు మీదే ఉంది. 2014 లో బెంగుళూరు అతడిని 14 కోట్లకు కొనుగోలు చేయగా 2015 లో ఢిల్లీ 16 కోట్లకు కొనుగోలు చేసింది.

19. యువరాజ్ సింగ్ భారతదేశపు రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డును 2012 లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. అలాగే 2014 లో పద్మశ్రీ అవార్డు... అదే ఏడాది ''మోస్ట్ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డును తీసుకున్నాడు.

20. యువరాజ్ ''మెహందీ షగ్నా డి'' అనే పంజాబీ సినిమాలో బాలనటుడిగా నటించాడు. అయితే యువరాజ్ తనకు యాక్టింగ్ అంటే ఇష్టం అని చాలాసార్లు ఒప్పుకున్నాడు. అలాగే యువరాజ్ సింగ్ అక్షయ్ కుమార్ నిర్మించిన బాలీవుడ్ కార్టోన్ మూవీ ‘జంబో’లో ''మహారాజా విక్రమ్'' పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.