టీడీపీ పొలిట్‌బ్యూరోలో మార్పులు? 

టీడీపీ పొలిట్‌బ్యూరోలో మార్పులు? 

టీడీపీ పోలిట్‌బ్యూరోలో మార్పులు జరగబోతున్నాయా? గల్లా అరుణ స్థానంలో వచ్చేది ఎవరు? పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న నేతకు ఇప్పటికైనా అవకాశం లభిస్తుందా? పార్టీ పరిశీలనలో ఉన్న పేర్లు ఏంటి? 

కొద్ది నెలల క్రితమే పొలిట్‌బ్యూరోలోకి వర్ల!

ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటనపై తుది కసరత్తు పూర్తయింది. ఈ కమిటీ ప్రకటన సందర్భంగానే  పొలిట్‌బ్యూరోలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.16 మందితో ఉండే పొలిట్‌బ్యూరోలో ఇప్పటికే కొందరు వెళ్లిపోగా.. ఆ స్థానంలో కొత్తవారిని తీసుకునే ఛాన్స్‌ ఉంది. కొద్దినెలల క్రితం వర్ల రామయ్యను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్న అధిష్ఠానం.. ఇప్పుడు మరికొన్ని మార్పులు..చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాల్వ శ్రీనివాసులకు ఛాన్స్‌ ఇస్తారా?

టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఒక్క చిత్తూరు జిల్లా నుంచే నలుగురు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్‌తోపాటు గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్‌ పొలిట్‌బ్యూరోలో ఉన్నారు.  కొద్దిరోజుల క్రితమే గల్లా అరుణ తప్పుకొన్నారు. వ్యక్తిగత కారణాలు, వయో భారం అని అరుణ చెప్పినా.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పొలిట్‌బ్యూరోలో ఉండటంపై అభ్యంతరాలున్నాయట. కాల్వ శ్రీనివాసులకు ఛాన్స్‌ ఇస్తారని పార్టీలోని ఓ వర్గం అనుకుంటున్నారు.

ఈసారి బుచ్చయ్యకు అవకాశం ఉంటుందా? 

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారిలో యనమల, కేఈ, అయ్యన్న, అశోక్‌గజపతిరాజులు పొలిట్‌బ్యూరోలో ఉన్నారు.  తర్వాత టీడీపీలో చేరిన వారు కూడా సభ్యులయ్యారు. అయితే పార్టీలో అత్యంత సీనియర్‌గా ఉన్న రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మాత్రం ఇప్పటి వరకూ ఆ పోస్ట్‌ దక్కలేదు. ఈసారి బుచ్చయ్యకు అవకాశం ఇస్తారని సమాచారం. 

బుచ్చయ్యకు అనుకూలిస్తున్న అంశాలు!

అయితే కమ్మ సామాజికవర్గం నుంచి పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. ఒకవేళ సీనియారిటీని తీసుకుంటే ఈసారి బుచ్చయ్యను ఎంపిక చేస్తారని సమాచారం. ఆయన కూడా పార్టీ కోసం అత్యంత నిబద్ధతో ఉన్న నేతగా గుర్తింపు పొందారు.  వయసు మీద పడినా పార్టీ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇవన్నీ ఆయనకు అనుకూలిస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. 

చంద్రబాబు ఏం లెక్కలు వేస్తారో?

బుచ్చయ్య చౌదరి విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని పార్టీ వర్గాలు చెబుతుంటే.. చివరి నిమిషంలో అధినేత చంద్రబాబు ఏం లెక్కలు వేస్తారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.