రియల్ హీరో సోనూసూద్ కి "యూఎన్‌డీపీ"పురస్కారం

రియల్ హీరో సోనూసూద్ కి "యూఎన్‌డీపీ"పురస్కారం

లాక్ డౌన్ టైంలో వలస కార్మికుల కోసం కోట్లు ఖర్చు చేసి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన సోనూ సూద్ రియల్ హీరో అయ్యాడు. దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చడంలో సోనూ సూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. బస్సు.. రైళ్లు.. విమానం ఇలా ఎవరికి ఏది అవసరమో అది బుక్ చేసి మరి వారి గమ్య స్థానాలకు చేర్చాడు. సోనూసూద్ కేవలం వలస కార్మికుల ట్రాన్స్ పోర్ట్ మాత్రమే కాకుండా ఎవరైతే వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తూ చనిపోయారో వారి కుటుంబాలకు కూడా సాయం చేశారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన వందలాది రిక్వెస్ట్ లకు కూడా స్పందించి తనకు తోచిన సాయం చేస్తూ వచ్చాడు. తాజాగా సోనూసూద్ ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది. ఇప్పటివరకు అద్భుత నటనకు అవార్డులు ప్రశంసలు గెలుచుకున్న సోనూ తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్‌డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్‌లో చాలాకొద్దిమందికి దక్కిన అరుదైన గౌరవాన్ని సోనూ అందుకోవడం విశేషం.