జగన్ భయపడాల్సిన భయం లేదు : ఉండవల్లి అభయం

జగన్ భయపడాల్సిన భయం లేదు : ఉండవల్లి అభయం

ఏపీ సిఎం వైఎస్ జగన్ కు సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రాజశేఖర రెడ్డి కొడుకుగా పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తారనుకున్నామని అన్నారు. పార్లమెంటు లో చేసిన చట్టం గొప్పదా ? మోదీ, చంద్రబాబు లు చేసుకున్న ఒప్పందం గొప్పదా ? అనే దానికి సమాదానం చెప్పాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన సమయంలో పార్లమెంట్ లో ఏమి జరిగిందో మాట్లాడే ధైర్యం టీడీపీ , వైఎస్సార్ కాంగ్రెస్ లకు లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక హోదా పక్కన పెట్టిందని ఇప్పుడు పోలవరం కూడా పక్కన పెడితే ఏలా ? అని ప్రశ్నించారు.      

పోలవరం ప్రాజెక్టు విషయం లో పార్లమెంట్ లో చేసిన చట్టం అమలు చేయాల్సిందేనని ఆయన అన్నారు. కేంద్రం చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు పనుల్లో 
2014 రేట్లు 2018 లో ఉంటాయా ? అని ప్రశ్నించారు. వైఎస్సార్ పేరు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన జగన్ పోలవరం పై మోదీని ఎందుకు నిలదీయడం లేదు ? అని ప్రశ్నించారు.  కేసులు ఉండటం వల్లే మోదీని ప్రశ్నించేందుకు జగన్ భయపడుతున్నారన్న ప్రచారం జనంలో ఉందని కానీ అలా కనుక జగన్ ను మోదీ జైలులో పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని అన్నారు. జగన్ ను జైలులో వేయటం అంత సులువా ? అని ప్రశ్నించిన అయన కేసులు నుంచి బయటపడేందుకు జగన్ మౌనం గా ఉంటే ప్రజలు క్షమించరని అన్నారు. 

 51 శాతం ఓట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలు జగన్ ధైర్యంగా మాట్లాడతారని భావించారు. కానీ జగన్ కు ధైర్యం ఏమైంది. కేవీపీ కోర్టు లో వేసిన పిటిషన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని అన్నారు. మీరు మోదీకి లొంగిపోయారనుకోవాలా ? అలా అయితే ఎందుకు లొంగిపోవాలి అని ప్రశ్నించారు. చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన అన్నారు. కేసులు విషయం లో వెంటనే శిక్ష పడదు. 
కేసులు విషయం లో జైలు కి వెళ్లినా మీరు నిలబెట్టిన వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని జగన్ కి ఉండవల్లి అభయం ఇచ్చారు.