లైవ్ టెలీకాస్ట్ వల్లే బీజేపీ బలపరీక్షలో ఓడింది..

లైవ్ టెలీకాస్ట్ వల్లే బీజేపీ బలపరీక్షలో ఓడింది..

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష వేళ.. లైవ్ టెలీకాస్ట్ ఉండటం వల్లే బీజేపీ బలపరీక్ష విషయంలో వెనక్కు తగ్గిందన్నారు. నాడు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ లోక్‌సభలో లైవ్ టెలీకాస్ట్ ఆపకపోతే విభజన జరిగి ఉండేది కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు మోడీ ప్రభుత్వంపై శాపనార్థాలు మాని.. పోరాటాన్ని చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. రాజీనామాకు సిద్ధపడిన వైసీపీ ఎంపీలు చర్చకు పట్టుబడితే.. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం ఎవరు చేశారో తేలిపోతుందన్నారు. 25 మంది ఎంపీలను మాకిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామంటున్న చంద్రబాబు, జగన్‌లు ప్రత్యేకహోదాను ఎలా సాధిస్తారో ప్రజలకు వివరించాలని కోరారు. 525 సీట్లు ఉన్న లోక్‌సభలో ఏపీ నుంచి వచ్చే 25 సీట్లు ఏ మాత్రం ప్రభావం చూపవని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. నాడు తిరుమల వ్యవహారాలపై స్వయంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన చంద్రబాబు..నేడు సీబీఐ విచారణకు ఎందుకు సంకోచిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు.