'ఉదయ' కెరటం!

'ఉదయ' కెరటం!

ఉదయ్ కిరణ్- ఈ పేరు వింటే ఈ నాటికీ కొందరి మదిలో వీణలు మోగుతాయి. ఆ పేరు మరికొందరికి ఓ మధురస్వప్నం. ఇంకొందరికి మధురమైన బాధ. ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురని కూలిన కెరటాన్ని తలపిస్తాడు ఉదయ్ కిరణ్. చిత్రసీమలో ప్రవేశమే చిత్రంగా జరిగింది అనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ తొలి చిత్రం 'మిస్టీరియస్ గర్ల్' (1999). ఈ సినిమా చాలా రోజుల తరువాత విడుదలకు నోచుకుంది. ఇక దర్శకుడు తేజ తొలి సినిమా 'చిత్రం' (2000)లోనూ చిత్రంగానే అవకాశం లభించింది ఉదయ్ కి. ఆ సినిమా ఘనవిజయంతో అందరూ ఒక్కసారిగా ఉదయ్ వైపు చూశారు. దాంతో ఉదయ్ తొలి చిత్ర నిర్మాతలు 'మిస్టీరియస్ గర్ల్'ను తెలుగులో విడుదల చేయాలని ఆశించారు. అప్పటి నుంచీ ఉదయ్ తో ఆ సినిమా దోబూచులాడుతూనే వచ్చింది. తరువాత "నువ్వు-నేను, మనసంతా నువ్వే" చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించడంతో ఉదయ్ కిరణ్ రూపంలో తెలుగు తెరకు ఓ నవతరం నాయకుడు దొరికాడని భావించారు. 

అపజయాలతో ఆగిన ఊపిరి
వరుసగా మూడు చిత్రాలతో ఘనవిజయం సాధించిన ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ చూసి ఎంతోమంది నిర్మాతలు అతనితో సినిమాలు తీయడానికి పరుగులు తీశారు. అడ్వాన్సుల మీద అడ్వాన్సులు ఇచ్చారు. ఉదయ్ దశ తిరిగిపోయింది అనుకున్నారు చాలామంది. ఉదయ్ పై మనసు పారేసుకున్న ఎందరో అమ్మాయిలు అతనితో మాట్లాడాలని తపించేవారు. ఎలాగో ఓలా అతని ఫోన్ నంబర్ సంపాదించి మాట్లాడేవారు. దాంతో తరచూ ఫోన్ నంబర్స్ మార్చడం ఉదయ్ వంతయింది. ఇలా సాగుతున్న సమయంలో ఉదయ్ కెరీర్ అనూహ్య పరిణామాలను చూసింది. వరుసగా పరాజయాలు పలకరించడం మొదలయింది. చిరంజీవి వంటి అగ్రశ్రేణి నటుని కూతురుతో ఉదయ్ కి వివాహనిశ్చితార్థం జరిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల పెటాకులయింది. మరోవైపు ఉదయ్ సినిమాలేవీ జనాన్ని ఆకట్టుకోవడం లేదు. దీంతో మెల్లగా ఉదయ్ లో మానసిక సంఘర్షణ మొదలయింది. మళ్ళీ  తాను నిలబడగలను అనే నమ్మకం ఉదయ్ లో కలిగించారు కొందరు. ఆ సమయంలోనే విశిష్టను జీవితభాగస్వామిని చేసుకున్నాడు. ఉదయ్ స్టార్ డమ్ పడిపోగానే ముందు అడ్వాన్సులు ఇచ్చిన వారంతా తిరిగి ఇవ్వమని అడగడం మొదలయింది. ఏమి చేయాలో పాలుపోని స్థితి. ఆరంభంలోనే హ్యాట్రిక్ చూసిన ఉదయ్ కి ఎందుకనో ఒక్కటంటే ఒక్క హిట్ పలకరించలేదు. దాంతో మరింత ఒత్తిడికి గురయ్యాడు. చివరకు తనను తానే బలిచేసుకుని ఎంతో మంది అభిమానులకు దుఃఖం మిగిల్చాడు. 

రెండు 'చిత్రాల' నడుమ...
ఎవరన్నారు ఉదయ్ కిరణ్ లేడని, మా మనసుల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాడు అనే అభిమానులు నేటికీ ఉన్నారు. అదే అతను సంపాదించుకున్న అసలైన ఆస్తి అని చెప్పవచ్చు. అయితే దానిని అనుభవించలేకపోయాడు ఉదయ్. ఉండి ఉంటే ఏదో ఒకరోజున ఒక్క చిత్రమైనా ఉదయ్ కి ఆనందం పంచేదేమో! ఉదయ్ తొలి చిత్రం విడుదలలో వింత పోకడలు చోటు చేసుకున్నాయి. చివరి చిత్రంగా రూపొందిన 'చిత్రం చెప్పిన కథ' విడుదలకు నోచుకోనేలేదు. ఈ రెండు చిత్రాల నడుమ చిత్రంగా సాగింది 'చిత్రం' కథానాయకుని చిత్రజీవితం. దానిని సగటు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు.