ఇరాన్ ఆంక్షల మినహాయింపుకి ముగింపు? ఆసియా దేశాలకు చమురు దెబ్బ

ఇరాన్ ఆంక్షల మినహాయింపుకి ముగింపు? ఆసియా దేశాలకు చమురు దెబ్బ

భారత్, చైనా సహా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఐదు దేశాలు ఇక దిగుమతులు ఆపాలని లేదా ఆంక్షలు ఎదుర్కోక తప్పదని అమెరికా సోమవారం ప్రకటన చేయనుంది. దీంతో క్రూడ్ ధరల్లో ఈ ఏడాదిలో అత్యధికంగా 3 శాతం పెరుగుదల కనిపించింది. మార్కెట్ పరిస్థితులు, పరిశ్రమను దెబ్బ తీస్తున్న అధిక ఇంధన ధరలను కారణంగా చూపిస్తూ దీనిని ఆసియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత ఏడాది ఇరాన్ చమురు దిగుమతి చేసుకొనేందుకు కొన్ని దేశాలకిచ్చిన మినహాయింపుకు అమెరికా ముగింపు పలకనుందని ద వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో తెలిపింది. ఇరాన్ పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం భారత్, చైనా, జపాన్ వంటి ఎనిమిది దేశాలకు తాత్కాలికంగా ఇచ్చిన 180 రోజుల మినహాయింపును రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సోమవారం ఉదయం అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పోంపో, ప్రస్తుతం ఇరానియన్ క్రూడ్ దిగుమతి చేసుకొంటున్న దేశాలకు మినహాయింపులు ఎత్తివేస్తున్నట్టు ప్రకటన చేస్తారని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ ద వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. ఇరాన్ పై గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ప్రధాన ఆర్థిక వనరులైన చమురు ఎగుమతులపై మినహాయింపులు తొలగించి వాటిని సున్నాకి తీసుకురావాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యధికంగా చమురు ఎగుమతి చేసే సౌదీ అరేబియా ఈ సరఫరా నష్టాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే తన ఉత్పత్తిని ఎంత మేర పెంచాలనే విషయంపై మొదట అంచనా వేసే ఉద్దేశంతో ఉంది. 

ప్రస్తుతం చైనా, భారత్ లు ఇరాన్ చమురుకు అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి. ఈ దేశాలు ట్రంప్ డిమాండ్లకు అంగీకరించకపోతే అవి ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసి వాణిజ్యం వంటి ఇతర అంశాలకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత భారత్ ఇరాన్ నుంచే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. దీంతో చైనా, భారత్ లు ఆంక్షల నుంచి మినహాయింపును పొడిగించాలని కోరుతున్నాయి. అమెరికా ఏకపక్షంగా ఇరాన్ పై ఆంక్షలు విధించడాన్ని బీజింగ్ వ్యతిరేకిస్తోంది. చట్ట ప్రకారమే ఇరాన్ తో ద్వైపాక్షిక సహకారం నెరపుతున్నట్టు చైనా చెబుతోంది. భారత్ లోని రిఫైనర్లు కూడా ప్రత్యామ్నాయ సరఫరా కోసం అన్వేషణ ప్రారంభించాయి. అయితే భారత ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.