ట్రంప్ అడ్డుకోవడంపై దర్యాప్తు ప్రారంభించిన హౌస్ ప్యానెల్

ట్రంప్ అడ్డుకోవడంపై దర్యాప్తు ప్రారంభించిన హౌస్ ప్యానెల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగం చేసి న్యాయ ప్రక్రియలో అడ్డంకులు కల్పించి ఉండొచచన్న అభియోగంపై అమెరికా హౌస్ ప్యానెల్ దర్యాప్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి 60 మందికి పైగా వ్యక్తులు, సంస్థల నుంచి పత్రాలను సేకరిస్తామని హౌస్ జుడిషియరీ కమిటీ అధిపతి ఆదివారం ప్రకటించారు. 

న్యాయశాఖ నుంచి ప్యానెల్ పత్రాలను కోరినట్టు ఏబీసీ 'దిస్ వీక్' కార్యక్రమంలో కమిటీ చైర్మన్ జెరాల్డ్ నాడ్లర్ తెలిపారు. ఈ వ్యవహారంలో మిగతా వారితో పాటు అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ట్రంప్ ఆర్గనైజేషన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అల్లెన్ వీజెల్ బర్గ్ కూడా ఉన్నట్టు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

'మేము అధికార దుర్వినియోగం, అవినీతి, న్యాయ ప్రక్రియకు అడ్డంకులపై దర్యాప్తును ప్రారంభించబోతున్నాం. చట్టాన్ని కాపాడటం మా బాధ్యత. అధ్యక్షుడు న్యాయప్రక్రియను అడ్డుకోవడం సుస్పష్టం' అని నాడ్లర్ అన్నారు. అయితే అభిశంసనను ఇప్పుడే  చేపట్టడం అనేది తొందరపాటు అవుతుందని తెలిపారు. 'ఎవరినైనా అభిశంసించే ముందు అది ఎందుకు చేపడుతున్నారో అమెరికన్ ప్రజలను ఒప్పించాల్సి ఉంటుందని" నాడ్లర్ చెప్పారు.

ట్రంప్ అడ్డుకున్నారనేందుకు ఆధారంగా ఎఫ్ బిఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీని ట్రంప్ తొలగించడాన్ని నాడ్లర్ ఉదహరించారు. ఆ సమయంలో కామీ 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం.. ట్రంప్ ప్రచారానికి, మాస్కోకి మధ్య సంభావ్య సంధి ఆరోపణలను దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ దర్యాప్తును ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లెర్ చేపట్టారు. ఆయన మరికొన్ని వారాల్లో తన దర్యాప్తు వివరాలను అమెరికా అటార్నీ జనరల్ కు అందజేయాల్సి ఉంది.

దర్యాప్తులో సాక్షులను భయపెట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారని కూడా నాడ్లర్ తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్, న్యాయశాఖ, ట్రంప్ ఆర్గనైజేషన్ నోరు విప్పడం లేదు. పత్రాలు అందజేయాలని కోరే వ్యక్తులు, సంస్థల జాబితాను కమిటీ సోమవారం విడుదల చేయనున్నట్టు నాడ్లర్ పేర్కొన్నారు.