మ‌హ‌బూబాబాద్‌లో కానిస్టేబుళ్ల‌కు క‌రోనా.. గుట్ట‌లే దిక్కు..!

మ‌హ‌బూబాబాద్‌లో కానిస్టేబుళ్ల‌కు క‌రోనా.. గుట్ట‌లే దిక్కు..!

క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌తో ముందుడి పోరాడుతున్నాయి క‌రోనా వారియ‌ర్స్.. అయితే, వారికి క‌రోనా సోకితే మాత్రం క‌ష్ట‌మే మ‌రి.. కరోనా వైరస్ బారినపడ్డ ఇద్దరు ప్రత్యేక పోలీస్ సిబ్బందికి నిలువనీడ లేకపోవడంతో ఓ గుట్ట సమీపంలో తలదాచుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక వైపు పెండ్లి, చిన్న పిల్లలు ... మరోవైపు కరోనా సోక‌డంతో.. దిక్కు తోచక గుట్టల సమీపంలో తలదాచుకున్నారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక పోలీస్ దళంలో పనిచేస్తున్న సుమారు 20 మంది కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. వీరిని హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాల్సిందిగా వైద్య సిబ్బంది సూచించారు. వీరిలో ఓ కానిస్టేబుల్ ఉంటున్న కిరాయి ఇంట్లో వివాహం ఉండటం చేత ఇంటి యజమాని ఇంటికి రావద్దని చెప్పారు. మరో కానిస్టేబుల్ ఇంటికి వెళ్లాలంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. దీంతో అతడు ఇంటికి వెళ్ళలేదు. ఈ ఇద్దరు ఆస్ప‌త్రిలోనే ఉంటామంటే  రెండు రోజుల త‌ర్వాత వసతి క‌ల్పిస్తామ‌ని వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఈ ఇద్దరూ స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం శివారులో గుట్ట సమీపంలో తలదాచుకున్నారు. ఇన్ని రోజులు అన్ని రకాల డ్యూటీలలో పని చేశామని, తీరా కరోనా వైరస్ సోకిన తర్వాత మమ్ములను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు వసతి చూపించాలని వేడుకుంటున్నారు.