టిక్‌టాక్ కోసం పోటీ.. రంగంలోకి ట్విట్ట‌ర్‌..!

టిక్‌టాక్ కోసం పోటీ.. రంగంలోకి ట్విట్ట‌ర్‌..!

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌ర్వాత ప‌రిస్థితి మారిపోయింది.. డ్రాగ‌న్ కంట్రీపై డిజిట‌ల్ యుద్ధాన్ని ప్ర‌క‌టించిన  భార‌త్.. ఆ దేశానికి చెందిన సోష‌ల్ మీడియా యాప్‌ల‌ను బ్యాన్ చేసింది.. ఇందులో కోట్లాది మంది అభిమానాన్ని చుర‌గొన్న టిక్‌టాక్ కూడా ఉంది. ఇక‌, ఆ త‌ర్వాత చాలా దేశాలు టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే ఆలోచ‌న చేశాయి.. ఇక‌, ఆ వెంట‌నే చైనాకు చెందిన టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు ప‌లు సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి.. ఈ షార్ట్‌ వీడియో యాప్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు ట్విట్ట‌ర్ కూడా రంగంలోకి దిగింది. 

టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవ‌డం కోసం దాని‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌తో ట్విట్ట‌ర్‌ చర్చలు కూడా ప్రారంభించిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే, వ‌చ్చే 45 రోజుల్లో ఏదైనా అమెరికాకు చెందిన‌ కంపెనీ కొనుగోలు చేయకుంటే... తమ దేశంలో టిక్‌టాక్‌ను నిషేధిస్తామ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌క‌టించ‌డం.. దీనిపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ‌డం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవ‌డానికి అమెరికా కంపెనీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. ట్విట్ట‌ర్ కూడా రంగంలోకి దిగింది. అయితే.. మైక్రోసాఫ్ట్ చేతికే టిక్‌టాక్ వెళ్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.