వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం

 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం

2021-22 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది టీటీడీ... ఈ ఏడాదికి రూ.2,937 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించగా.. టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇక, ఉగాది నుంచి భక్తులకు ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి.. టీటీడీ పరిధిలోకి మరికొన్ని ఆలయాలు రానున్నాయి. టీటీడీ కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు రూపొందించాలని బోర్డు ఆదేశించింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. బర్డ్ హాస్పిటల్స్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని పాలక మండలి ప్రకటించింది. భవనాల నిర్మాణానికి 9 కోట్ల రూపాయలను కేటాయించింది. టీటీడీ పరిధిలోని వేదవిజ్ఞాన పీఠం పరిధిలోకి వేదపాఠశాలు అన్నింటిని  తీసుకువస్తామని ప్రకటించింది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వినియోగాన్నినియంత్రించడంతో పాటు గ్రీన్ పవర్‌ని వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపింది. 

ఇక, ముంబై, జమ్మూ‌లో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామంటోంది టీటీడీ.. అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా స్థలాన్ని కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతామని పాలక మండలి ప్రకటించింది.. మరోవైపు.. ఉగాది నుంచి భక్తులకు ఆర్జిత సేవలకు అనుమతించనుండగా.. ఆర్జిత సేవలు ప్రారంభించే లోపు తిరుమలలోని వివిధ విభాగాలలో విధులలో వున్న ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పాలకమండలి నిర్ణయించింది. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించేందుకు సిద్ధమైన టీటీడీ.. గో మాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానించింది.. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు.