కొత్త రాగం అందుకున్న ఎమ్మెల్యే... కన్నేసి ఉంచిన పార్టీ పెద్దలు..

కొత్త రాగం అందుకున్న ఎమ్మెల్యే... కన్నేసి ఉంచిన పార్టీ పెద్దలు..

ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు చాలా డిఫరెంట్‌. ఏం చేసినా అందులో ప్రచారం చూసుకుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాస్పదం కూడా అయ్యారు. కానీ అవేమీ లెక్క చేయరని టాక్‌. తాజా ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఇంతకీ ఏం ఆశించి ఎమ్మెల్యే ప్రచార యావలో మునిగిపోతున్నారు? 

మైనారిటీ కోటాలో మంత్రి అవుదామని అనుకున్నారు!

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రెండోసారి గెలిచారు. పైగా పార్టీలో ఉన్న ఏకైక ముస్లిం మైనారిటీ శాసనసభ్యుడు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే మైనారిటీ కోటాలో మంత్రి అవుతానని అనుకున్నారు. కానీ కాలేదు. రెండోసారి శాసనసభ్యుడైన తర్వాత కూడా అదే ఆశాభంగం. ఆ కల కలగానే ఉండిపోయింది. తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తి రాగం వినిపించే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉండటం లేదని సంచలన కామెంట్స్‌ చేశారు. అవి పెద్ద చర్చకు కారణమయ్యాయి.  అప్పటి నుంచి ఎమ్మెల్యేకు టీఆర్‌ఎస్‌కు మధ్య గ్యాప్‌ పెరిగిందని టాక్‌. 

షకీల్‌ పార్టీ మారిపోతారని కూడా చర్చ జరిగింది!
షకీల్‌ కదలికలపై కన్నేసి ఉంచిన పార్టీ పెద్దలు!

ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో కానీ గేర్‌ మార్చేశారు షకీల్‌. ప్రత్యర్థి పార్టీ ఎంపీ భేటీ అయ్యి రాజకీయవర్గాల్లో చర్చకు కారణమయ్యారు. పార్టీ మారిపోతారని కూడా ప్రచారం జరిగింది. ఆ సమయంలో పార్టీలో కీలక నేత మాట్లాడటంతో షకీల్‌ శాంతించారనే టాక్‌ నడిచింది. కానీ.. బీజేపీ నాయకులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆపలేదు. అయితే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకే ఈ ఎత్తుగడలని కొందరు భావించారు. ఇదే సమయంలో షకీల్‌ కదలికలపై పార్టీ పెద్దలు ఓ కన్నేసి ఉంచారు. మరి.. పరిస్థితులు బాగాలేవని అనుకున్నారో లేక లెక్కలు తేడా కొడతాయని భావించారో కానీ ఎమ్మెల్యే సైలెంట్‌ అయ్యారు. 

తాజాగా టీఆర్‌ఎస్‌ జపం మొదలుపెట్టారా?

తాజాగా ఆయన రూట్‌ మార్చేశారు. సడెన్‌గా టీఆర్‌ఎస్‌ జపం మొదలుపెట్టారు. పార్టీలో కీలక నేతకు దగ్గరైన ఓ ఎమ్మెల్యే తనకు బాగా క్లోజ్‌ అని ప్రచారం చేసుకుంటున్నారట. ఆ నేతకు దగ్గరవడం ఎలా అన్న దానిపై ఆ ఎమ్మెల్యే వద్ద షకీల్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నట్లు సమాచారం. అందుకే ఆగస్టు 15న ఆ నేతను పొగడ్తలతో ముంచెత్తారని అంటున్నారు. ఈ వ్యాఖ్యల వీడియో కాస్తా వైరల్‌ కావడంతో టీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. అంతా పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిసారేస్తున్నారు. ఎమ్మెల్యే షకీల్‌ జిమ్మిక్కులను ఆ నేత అంత తొందరగా నమ్మబోరని అంటున్నారట. అయినా షకీల్‌ మాత్రం.. ఆయన ముఖ్యమంత్రి అయితే తనకు మంత్రి పదవి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట.