అవిశ్వాస చర్చలో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుంది...

అవిశ్వాస చర్చలో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుంది...

అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో తాము కూడా పాల్గొంటామని స్పష్టం చేశారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్... కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వినోద్... చర్చలో పాల్గొని ఏపీని, కేంద్రాన్ని సభలో నిలదీస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతో ఏపీ నిర్మించుకుంటోందన్న వినోద్... తెలంగాణ సొంత వనరులతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయమని కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి ఎందుకు లేఖ రాశారనే విషయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామన్నారు. మరోవైపు హైకోర్టు విభజన జాప్యానికి ఏపీయే కారణమని మండిపడ్డ వినోద్... దీనిని కూడా చర్చలో లేవనెత్తనున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వారినెవరినైనా నిలదీస్తామని స్పష్టం చేశారు వినోద్ కుమార్... తెలంగాణలో విభజన హామీలు అమలులో జరుగుతున్న జాప్యం పై కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్న ఆయన... ఎన్నికలలో కలిసి పోటీ చేసి... నాలుగేళ్లు అధికారాన్ని పంచుకుని, ఇప్పుడు అవిశ్వాసం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.