కల్వకుర్తి తెరాసలో వర్గ పోరు !

కల్వకుర్తి తెరాసలో వర్గ పోరు  !
వారిద్దరూ అధికార పార్టీ నేతలే. వేదికపై కరచాలనం చేసుకుంటారు. స్టేజ్‌ దిగగానే గోతులు తవ్వుకుంటారు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికలన్నట్లు బలం పెంచుకునేందుకు రాజకీయాలు చేస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షంలా తగువులాడుకుంటున్న వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. 
 
ఎమ్మెల్యే జైపాల్‌ వర్సెస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి టీఆర్‌ఎస్‌లో గ్రూప్‌ తగాదాలు పీక్‌ స్టేజికి చేరాయి. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌,  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య కొనసాగుతున్న వర్గపోరు వల్ల వారి అనుచరులు, ద్వితీయశ్రేణి నాయకులు రెండుగా చీలిపోయారు. టీఆర్ఎస్‌ పెద్దలు ఎవరైనా వస్తే.. కలిసిఉన్నట్లు నటిస్తారని.. ఆ కార్యక్రమం ముగియగానే కయ్యానికి సిద్ధంగా ఉంటారని పార్టీలో కథలు కథలుగా చెప్పుకొంటారు. 
 
సొంత బలాన్ని పెంచుకుంటున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి!

కల్వకుర్తిలో తమ ముద్ర వేసుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరికి వారుగా తాపత్రయ పడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు ఎమ్మెల్యే కసిరెడ్డి. కానీ.. అధిష్ఠానం జైపాల్‌ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో నియోజకవర్గంలో చాపకింద నీరులా తన అనుచరగణాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఎమ్మెల్సీ. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కసిరెడ్డి వర్గీయుల్లో కొందరు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి, ఇంకొందరు ఇండిపెండెంట్‌లుగా బరిలో నిలిచి గెలుపొందారు.  కడ్తాల్‌ కాంగ్రెస్‌ ఎంపీపీ కమ్లి మొత్యానాయక్‌తోపాటు మరికొందరికి కసిరెడ్డి టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలో చేర్చుకుని తన శిబిరంలో బలాన్ని పెంచుకున్నారు. వీరంతా కసిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి హాజరవుతారు. ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాల్లో కనిపించరు. 
 
ఎంపీపీకి చెప్పకుండా ఎమ్మెల్యే సమావేశం!

ఇదే సమయంలో తనకు గిట్టని ఎంపీపీలకు చెప్పకుండా మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఆమనగల్‌లో ఇదే జరగడంతో ప్రత్యర్థివర్గం రగిలిపోతుందని సమాచారం. మీటింగ్‌ జరుగుతుండగా వచ్చిన ఎంపీపీ అనితా నాయక్‌.. అక్కడికక్కడే అధికారులను, ఎమ్మెల్యేను నిలదీయడం పార్టీలో చర్చకు దారితీసింది.  మొత్తంమీద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఇలా రోజుకో కొత్త వివాదం, వర్గ పోరు తెరపైకి వస్తుండటంతో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్‌లో తీవ్రగందరగోళానికి దారితీస్తున్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.