సాగర్‌ ఉపఎన్నికలో హాట్‌ టాపిక్‌గా మారిన వీడియో...!

సాగర్‌ ఉపఎన్నికలో హాట్‌ టాపిక్‌గా మారిన వీడియో...!

హీట్‌ మీద ఉన్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో ఒక వీడియో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వీడియోను డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ చేయడంతో హైప్‌ ఇంకా పెరిగింది. సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.. ఆర్జీవీ ఎందుకు ఫ్లాట్‌ అయ్యారు? ఉపఎన్నికకు దానికి ఉన్న లింకేంటి? లెట్స్‌ వాచ్‌!

ఎన్నికల సమయంలో బయటకొచ్చిన వీడియో!

పెట్‌ డాగ్‌ను ఆరు బయటకు తీసుకెళ్తున్నట్టుగా.. చిరుతపులితో కలిసి వాకింగ్‌ చేస్తోన్న ఈ వ్యక్తి ఎవరో కాదు. నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నోముల భగత్‌. ఆఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు చిరుతతో సరదాగా సఫారీ చేశారు. అప్పుడు తీసుకున్న వీడియో ఇప్పుడు ఉపఎన్నిక సమయంలో బయట కొచ్చింది..సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయింది.  

తనకు ఓటు ఉంటే భగత్‌కే వేస్తానన్న ఆర్జీవీ!

ఉపఎన్నిక లేకపోతే ఈ వీడియోను ఎవరూ పెద్దగా పెట్టించుకునే వారు కాదేమో. డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ఈ వీడియోను ట్వీట్‌ చేయడంతో పాపులారిటీ వచ్చేసింది. వీడియోతోపాటు భగత్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ ఇంకా ఆసక్తి కలిగిస్తున్నాయి. చిరుతతో ప్రచారం చేస్తోన్న వ్యక్తిని చరిత్రలో చూడలేదని చెప్పారు.  కేసీఆర్‌, కేటీఆర్‌లు టైగర్‌.. లయన్‌లుగా తనకు తెలుసని.. కానీ ఒక చిరుతను చైన్‌తో కట్టేసి వాకింగ్‌ చేస్తోన్న భగత్‌ను ఇప్పుడే చూస్తున్నానని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ఒకవేళ నాగార్జునసాగర్‌లో తనకు ఓటు ఉంటే  ఈ రియల్‌ హీరోకే ఓటు వేసేవాడినని ముగించారు రాంగోపాల్‌ వర్మ. 

కామెంట్ల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు!

ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో ఈ వీడియో సర్క్యూలేట్‌ కావడం ఒక ఎత్తు అయితే.. దానికి ఆర్జీవీ కామెంట్స్‌ ఇంకొ ఎత్తు. ఇంకేముంది.. నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు హోరెత్తిస్తున్నారు. ఇంకొందరు వీడియోను ఆసక్తిగా  చూస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఎలా బయటకొచ్చిందో కానీ.. బరిలో ఉన్న అభ్యర్థికి మాత్రం సోషల్‌ మీడియాలో ప్రచారం ఓ రేంజ్‌లో జరుగుతోంది.