తెలకపల్లి రవి : అల్విదా, ప్రణబ్‌ దా! మీ రాజకీయ రికార్డు ఇంత అరుదా!

తెలకపల్లి రవి :  అల్విదా, ప్రణబ్‌ దా! మీ రాజకీయ రికార్డు ఇంత అరుదా!

తెలకపల్లి రవి

మీరు చాలా సమర్థులు. కనుక ప్రధాని పదవిలో మిమల్ని  బంధించి వివిధ విషయాలలో మీ సేవలు ఉపయోగించుకునే అవకాశం పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని సోనియా గాంధీ చెప్పినప్పుడు నేను ఎప్పటికీ మీతోనే వుంటానని చెప్పిన వాస్తవిక వాది ప్రణబ్‌ ముఖర్జీ. పాండిత్యం పెద్దరికం పదవుల్లో ప్రథమ శ్రేణి  అన్నీ వున్నా అందరితో సాన్నిహిత్యం వున్న అరుదైన నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ప్రణబ్‌ ముఖర్జీ ఎన్ని శాఖలు నిర్వహించారో చెప్పడం అవసరం లేని పని.  ఆర్థిఖ శాఖతో మొదలు పెట్టి ఆయన కీలకమైన అన్ని శాఖలు చుట్టేశారు. దాదాపు ప్రతి శాఖపైనా తన ముద్ర వేశారు. విజ్ఞానం విధేయత కొలబద్దుగా ఇందిరాగాంధీ  ఎంపిక చేసిన  ప్రణబ్‌ ఎమర్జన్సీలోనూ ఆమెతోనే వున్నారు. బెంగాల్‌లో ఆమెకు చాలా సన్నిహితుడు మాత్రమే గాక ఎమర్జన్సీ విధించాలని సలహా ఇచ్చిన సిద్ధార్థ శంకర్‌ రే కూడా తర్వాత మారిపోయారు గాని  ప్రణబ్‌ వదలిపెట్టలేదు. కాకుంటే ఆమె హత్య తర్వాత సీనియర్‌ను గనక తనకు ముందు ప్రధానిగా అవకాశం వస్తుందనుకున్నారు. రాజీవ్‌ గాంధీతో ఎకాఎకిన ప్రమాణ స్వీకారం చేయిస్తే  కష్టపెట్టుకున్నారు. దూరం జరిగి రాష్ట్రీయ కాంగ్రెస్‌ పెట్టినా తర్వాత మళ్లీ రాజీకి వచ్చారు. రాజీవ్‌ హత్య తర్వాత తాను వరుసలో వున్నా  పివి నరసింహరావును కాంగ్రెస్‌ అద్యక్ష పదవి విషయం చెప్పి సన్నద్ధం చేసింది ప్రణబ్‌  ముఖర్జీనే.  పివి హయాంలో మొదట ప్రణాళికా సంఘ ఉపాద్యక్ష పదవి, ఆఖరి ఏడాది మంత్రి పదవి  చేపట్టినా తర్వాత మాత్రం వారి మధ్య సంబంధాలు అంతంతగానే వుండేవి. ఆఖరులో కాని మంత్రి కాలేదు. కాని తర్వాత సోనియాగాంధీని విదేశీయురాలనే దుమారం రేగినపుడు ప్రణబ్‌ తిరిగివచ్చి ఆమెకు అండగా నిబడ్డారు.  అ యుపిఎ ప్రభుత్వంలో ప్రధానిని కాగలనని మూడోసారి అనుకున్నప్పుడు ఆమె అన్నమాటు మొదటే చూశాం. మూడుసార్లు ప్రధాని పదవి ఎంపికలోకి రాకపోయేసారికి  ఆయనను   ప్రధాని  పదవికి శాశ్వత నిరీక్షకుడు అన్న ముద్ర పడిపోయింది. అయితే మన్మోఙాన్‌ సింగ్‌ ప్రధాని అయినా ప్రణబ్‌ ముఖర్జీ దానికి ప్రధాన ఆలంబన. ఆయన14 మంత్రివర్గ ఉపసంఘలకి నాయకుడుగా వున్నారు. అది తెలంగాణ సమస్య అయినా అణు ఒప్పందంపై వామపక్షాతో చర్చయినా ప్రణబ్‌ దగ్గరకే వచ్చేవి. 

రాష్ట్రాలో రాజకీయ సంక్షోభాల పరిష్కారానికి కూడా వెళ్లవలసి వచ్చేది. ప్రధాని కాకుండానే ప్రధాన భారం మోసిన ప్రణబ్‌ను మన్మోహన్‌ కూడా చాలా గౌరవించేవారు. మొదట కొన్ని ఇతర ఆలోచలను చేసినా రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి ఈ పూర్వరంగమే కారణమైంది. ఆ స్తానంలోనూ ఆయన కేవలం రబ్బరు స్టాంపుగా కనిపించకుండా కొన్ని కొత్త పద్దతులు తీసుకొచ్చారు. కఠిన నిర్నయాలు తీసుకున్నారు. ప్రతిపక్షాల ప్రతినిధివర్గాను కుసుకోవడానికి చాలా అవకాశమివ్వడం వాటిలో ఒకటి.  పదవిలో వుండగానే తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పరిశీలనను మూడు భాగాలుగా రాసిన ఒకే ఒక రాష్ట్రపతి ఆయన. అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పే ప్రణబ్‌ దా అందులోనూ తన భావాలు ఏమాత్రం దాచుకోలేదు. తమ నాయకత్వంతో తాను విభేదించిన అంశాలు తనకు వస్తాయనుకున్న అవకాశాలు ఎలా దూరమైనాయనేది కూడా నిర్మొహమాటంగా చెప్పేశారు. 

ప్రణబ్‌దా జీవితంలో మరో విశేషమేమంటే ఆయన పెద్ద ప్రజా పునాది వున్న నాయకుడు కాదు.  ఆ కాలంలో బెంగాల్‌లో  సిపిఎం అప్రతిహతంగా పాలిస్తున్న పరిస్థితి. రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూనే జ్యోతిబాసు వంటివారితో కూడా ఆయన వ్యక్తిగత సంబంధాలు పాటించేవారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఆయన ముందు మోకరిల్టడం చూస్తాం.  ముఖ్యమంత్రులు జగన్‌ కెసిఆర్‌కు తనతోవున్న గౌరవ ప్రదమైన సంబంధాలు అందరికీ తెలుసు. ఆరోజులలో విజయమ్మకు ఆయన ఇంటర్వూులు ఇవ్వడంపై టిడిపి కాంగ్రెస్‌ గుర్రుగా వుండేవి.ఇక తెలంగాణ ఉద్యమ క్రమంలో  ప్రణబ్‌ కమిటీ నిరంతర ప్రస్తావనగా వుండేది. మీడియాతోనూ ఆయన సూటిగా పొదుపుగా మాట్లాడేవారు. కొన్నిసార్లు కఠినంగానూ వుండేది.  ఆరెస్సెస్‌ వేదికకు ఆహ్వానించినప్పుడు ఏం చెబుతారనే ఆసక్తి నెలకొనగా లౌకిక తత్వం అవసరం చెప్పి వచ్చారు. రాష్ట్రపతిగా పదవీ కాలం మధ్యలో నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టినా రాజ్యాంగ నిబంధన ప్రకారం సజావుగా సాగేందుకు ప్రాధాన్యత నిచ్చారు. మోడీ కూడా ఆయనతో దగ్గరగా వుండేందుకు ఎంతగానో ప్రయత్నించడం చూశాం. ఎందుకంటే ఆయన అందరికీ ప్రణబ్‌దా అంటే పెద్దాయన అనిపించుకున్నారు. పదవీ కాలం చివరలో స్వగ్రామం సందర్శించి మూలాలు మర్చిపోరాదనే సందేశం ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత రాజ్‌దీప్‌ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మధ్యలో ప్రశ్నలు వేస్తుంటే మాజీ రాష్ట్రపతిని ఇలా అడ్డుకోకూడదు. ముందు విచారం వెలిబుచ్చు అని సారీ చెప్పించారు.అంతర్జాతీయ వేదికపైనా అభినందను పొందారు.

ఆయన  కన్నుమూతతో దేశం ఒక సమున్నత రాజనీతివేత్తను పాలనా చతురుడైన వ్యూహ కర్తను కోల్పోయింది. అనేక ఢక్కాముక్కీు తింటూనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించి గౌరవప్రదంగా క్రియాశీల జీవితం నుంచి సెలవు తీసుకున్న ఒక కురువృద్ధుని ప్రస్థానం అది. చివరి దశలోనూ కోమాతో పోరాడి కన్నుమూసిన ప్రణబ్‌ దా దేశ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతారు.