వచ్చిన వెంటనే స్టాంప్స్ ను విరగొట్టిన బౌల్ట్...

వచ్చిన వెంటనే స్టాంప్స్ ను విరగొట్టిన బౌల్ట్...

ఐపీఎల్ 2020 కోసం విదేశీ ఆటగాళ్లు అందరూ యూఏఈ చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తమ తమ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత ఏడాది ఢిల్లీ తరపున ఆడిన బౌల్ట్ ను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్‌ రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే యూఏఈకి కొంత ఆలస్యంగా వెళ్లిన బౌల్ట్ తాజాగా తన క్వారంటైన్ ను ముగించుకొని శిక్షణ శిబిరంలోకి అడుగుపెట్టాడు. వచ్చిన వెంటనే ముంబై ప్రధాన కోచ్‌ మహేల జయవర్దనే ఆధ్వర్యంలో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన బౌల్ట్ ఎక్కువగా యార్కర్లు సంధిస్తూ కనిపించాడు. అలా వేసిన ఓ బంతికే మిడిల్‌ స్టంప్‌ వికెట్‌ విరిగిపోయింది. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ముంబై ఇండియన్స్ 'క్లీన్‌ బౌల్ట్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఆ జట్టు నుండి వ్యక్తిగత కారణాలతో లసిత్‌ మలింగ తప్పుకోవడంతో పేస్ భాధ్యతలు జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి బౌల్ట్‌ పంచుకోనున్నాడు. అయితే ముంబై సెప్టెంబర్ 19న ప్రారంభ మ్యాచ్ చెన్నై తో ఆడనుంది.