త్వరలోనే దేశవ్యాప్తంగా 5జి సేవలు

త్వరలోనే దేశవ్యాప్తంగా 5జి సేవలు

దేశవ్యాప్తంగా 5జి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 5జి సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీలో ముఖేష్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. డిజిటల్ రంగంలో భారత్ పరుగును కొనసాగించేదిశగా ... రిలయన్స్ జియో అడుగులేస్తోంది. ఇప్పటికే మొబైల్ డేటా సేవల రంగంలో తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్న జియో.. ఇప్పుడు 5జిలోనూ సత్తా చాటాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు  రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.TM ఫోరం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీలో ఈ విషయాన్ని తెలిపారు. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155 వ స్థానంలో ఉన్న భారత్ 2016లో టెలికం పరిశ్రమలోకి జియో అడుగు పెట్టిన తర్వాత అగ్రస్థానానికి వచ్చిందన్నారు. 

2జీ నిర్మాణానికి టెలికం కంపెనీలకు పాతికేళ్ళు పడితే, 4జీ నిర్మాణానికి జియోకు కేవలం మూడేళ్ళు మాత్రమే పట్టిందని తెలిపారు ముఖేష్.  జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లో 10 కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకుందన్నారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్ వర్క్‌లో చేరుతున్నారన్నారు. దేశంలో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి చేరుకుందన్నారు. 50 కోట్ల మంది ఖాతాదారుల దిశగా రిలయన్స్ జియో సాగుతోందన్నారు. కనెక్టివిటీలో మరింత ముందుకు సాగే లక్ష్యంలో భాగంగా హైస్పీడ్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను రిలయన్స్ ప్రారంభించిందన్నారు ముఖేష్.