సీఎం ఆదేశించినా వీసీల నియామకం జరగడంలేదా..
తెలంగాణలో వీసీల నియామకాల ఎంపిక ఇదిగో అదిగో అంటున్నారు తప్ప.. పూర్తి కావడం లేదు. సీఎం ఆదేశాలను అమలు చేయడంలోనూ అలసత్వమేనట. ఎవరిని కదిపినా.. ఒకరి ముఖం మరొకరు చూసుకోవడమే తప్ప సమాధానం లేదట. ఇంతకీ ఏం జరుగుతోంది?
సెప్టెంబర్ చివరికే కొత్త వీసీలు వస్తారని ఆశించారు
తెలంగాణలో 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్స్ లేరు. దాదాపు ఏడాదిన్నరగా ఈ పరిస్థితి ఉంది. వీసీల నియామకానికి సంబంధించి ఏడాది క్రితమే ప్రక్రియ ప్రారంభించినా కొలిక్కి రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి వీసీల నియామక ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ తరువాత కరోన ప్రభావంతో సమస్య పెండింగ్‌లో పడింది. ఆగస్టు 26న మరోసారి సమీక్షించిన ముఖ్యమంత్రి వెంటనే కంప్లీట్ చేయాలని ఆదేశించారు. సీఎస్ సోమేశ్ కుమార్‌కి బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబరు చివరికి యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్లర్స్ వస్తారని అనుకున్నా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.
సీఎం ఆదేశించి నెలైనా ప్రక్రియ అంగుళం కదలలేదు!
సెర్చ్ కమిటీ మీటింగ్‌పై ప్రచారం హోరెత్తింది. ఆశావహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ కూడా మొదలుపెట్టారు. VC పోస్ట్ ఆశిస్తున్నవారు ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ కూడా జరిగింది. నెల రోజులుగా విద్యాశాఖ వర్గాల్లో దీనిపైనే చర్చ సాగింది కూడా. సీఎం రెండోసారి అధికారులను ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా.. ఒక్క అంగుళం కూడా ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై ఏం జరుగుతుందో తెలియడం లేదట. రేపో మాపో ఆదేశాలు వస్తాయి.. ఫైల్ వేగంగా కదులుతుంది అని ఆశించిన వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారట. ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని అడగడం తప్ప ఎవరి దగ్గర ఆన్సర్ లేదట. పైగా ఈ ప్రక్రియతో సంబంధం ఉన్నవారిని ఎవరినైనా అడిగితే.. అయ్యో మాకేమి తెలియదు.. అంతా పైవాళ్లకే తెలుసు అని అని చెబుతున్నారట. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండని ఎదురు ప్రశ్నిస్తున్నారట.
విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు వీసీలు కీలకం!
మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తే తప్ప వైస్ఛాన్స్లర్స్ నియామకం తేలేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. కరోనాతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. అవన్నీ క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు ఈ సమయంలో VCల పర్యవేక్షణ చాలా కీలకం. పూర్తిస్థాయి ఉప కులపతి లేకపోతే ఏ పనీ ముందుకు సాగదు. మరి.. తెలంగాణలో వర్సిటీలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో.. VCల నియామక ప్రక్రియకు ఎందుకు బ్రేక్ పడిందో ఆ దేవుడికే తెలియాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)