దర్శకేంద్రజాలం 'పెళ్ళిసందడి'కి పాతికేళ్ళు

దర్శకేంద్రజాలం 'పెళ్ళిసందడి'కి పాతికేళ్ళు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన 'పెళ్ళి సందడి' జనవరి 12తో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 1996 జనవరి 12న విడుదలైన 'పెళ్ళి సందడి' ఆ నాటి సంక్రాంతి సంబరాల్లో భలేగా సందడి చేసింది. ఈ చిత్రంతోనే హీరో శ్రీకాంత్ కు స్టార్ హోదా లభించింది. ఇక రవళికి నాయికగా మంచి పేరు దక్కింది. ఇందులోని కామెడీని చూసి, తరువాత పెళ్ళిళ్ళు  జరుపుకున్నవారు అదే తీరున చతుర్లు ఆడడమూ జరిగింది. ఈ సినిమా తరువాత వివాహ వాహనాలపై ఫలానా వారి ఇంట 'పెళ్ళిసందడి' అంటూ రాసుకొనేవారు. దీనిని బట్టే 'పెళ్ళి సందడి' చిత్రం ఎంతలా జనాన్ని ఆకట్టుకుందో ఊహించవచ్చు. 

'పెళ్ళిసందడి' చిత్రానికి ముందు టాప్ హీరోస్ బాలకృష్ణ 'వంశానికొక్కడు', నాగార్జున 'వజ్రం' విడుదలయ్యాయి. తరువాత వెంకటేశ్ 'ధర్మచక్రం' వచ్చింది. ఆరంభంలో టాప్ స్టార్స్ సినిమాలకే జనం పరుగులు తీశారు. పండగ నుంచీ 'పెళ్ళి సందడి' ఊపందుకుంది. ఆ ఊపు దాదాపు పదినెలల పాటు సాగింది. ఆ తరువాత ఎన్ని చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకినా, చిన్న చిత్రంగా వచ్చి, అతి పెద్ద విజయాన్ని మూటకట్టుకుంది 'పెళ్ళిసందడి'. మరో విచిత్రమేమంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించడం. 

కలలో పిల్లతోనే కళ్యాణం!
కథ విషయానికి వస్తే, హీరోకు కలలో ఓ అందాలభామ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఎవరో అతనికి తెలియదు. కేవలం నాభి దగ్గర మచ్చ  ఒక్కటే ఆధారం. ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే పెద్దలు ఓ అమ్మాయితో పెళ్ళి నిర్ణయిస్తారు. ఆ అమ్మాయి, ఈ అబ్బాయినే భర్తగా ఊహించుకొని కలల్లో తేలిపోతూ ఉంటుంది. చివరకు ఓ పెళ్ళికి వెళ్ళిన హీరోకు అక్కడ తన స్వప్నసుందరి కనిపిస్తుంది. తరువాత అదే అమ్మాయికి అనుకోకుండా హీరో సంగీతం మాస్టారు అవుతాడు. ప్రేమించుకుంటారు. పెద్దలకు చెప్పాలనకుంటారు. చివరకు అతనికి నిశ్చితార్థమైన అమ్మాయికి, స్వప్నసుందరి చెల్లెలు అని తేలుతుంది. అక్క త్యాగం, హీరోతో ఆమెచెల్లెలికి పెళ్ళి. శుభం కార్డు. ఇదీ కథ. దీనిని పాటల పందిరిలా అలంకరించి అలరించారు రాఘవేంద్రరావు. 

అవార్డులూ... రివార్డులూ...
'పెళ్ళిసందడి' చిత్రంలో మరో నాయికగా దీప్తి భట్నాగర్ నటించింది. ఇతర పాత్రల్లో సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, శివాజీరాజా, బాబూమోహన్, ఏవీయస్, రాజా రవీంద్ర, శ్రీలక్ష్మి, చిట్టిబాబు, సుత్తివేలు, జెన్నీ, అనంత్, గుండు హనుమంతరావు, విశ్వేశ్వరరావు,  రజిత నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ రచన చేయగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం సమకూర్చారు. వేటూరి, సిరివెన్నెల, జొన్నవిత్తుల, చంద్రబోస్, సామవేదం షణ్ముఖ శర్మ, కీరవాణి పాటలు రాశారు. ఇందులోని తొమ్మిది పాటలూ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పెళ్ళిళ్ళకు పిలవకుండానే వచ్చి, "కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా?"అంటూ ఆప్యాయంగా పలకరించేవారి మాటలు కూడా ప్రేక్షకులను రంజింప చేశాయి. పెళ్ళిళ్ళలో ఈ మాటలు ఈ నాటికీ వినిపిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమా ద్వారా కె.రాఘవేంద్రరావుకు ఉత్తమ దర్శకునిగా, ఉత్తమ నృత్య దర్శకునిగా రెండు నంది అవార్డులు లభించాయి. కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డుతో పాటు ఫిలిమ్ ఫేర్ అవార్డూ దక్కింది. 

రికార్డుల పర్వం
చిన్న సినిమాగా వచ్చిన 'పెళ్ళిసందడి' అతి పెద్ద విజయం సాధించి, అంతకు ముందుఉన్న  పలు రికార్డులను బద్దలు చేసింది. ఈ చిత్రం 30 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 27 కేంద్రాలలో డైరెక్టుగా రెగ్యులర్ షోస్ తో రజతోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా నిలచింది. 12 కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమయింది. విజయవాడ - స్వర్ణ ప్యాలెస్ లో ఏకధాటిగా 301 రోజులు ఆడింది. ఇక హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలో స్వర్ణోత్సవం చూసింది. లేట్ రన్ లో మరో పది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో 200 రోజులు హౌస్ ఫుల్ సాధించింది. గుంటూరు బాలభాస్కర్ లో 150 రోజులు హౌస్ ఫుల్ చూసింది.  ఇక హైదరాబాద్ సంధ్య థియేటర్ లో కోటి రూపాయలు పోగేసి, సింగిల్ థియేటర్ లో కోటి రూపాయలు చూసిన తొలి తెలుగు చిత్రంగా నిలచింది.