టాలీవుడ్ కమెడియన్స్ రీయూనియన్

టాలీవుడ్ కమెడియన్స్ రీయూనియన్

ఒక సినిమా ప్రేక్షకుల అభినందనలు పొందాలంటే హీరో, విలన్, హీరోయిన్‌లు ఎంత ముఖ్యమో హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. హాస్యంలేని సినిమా ప్రేక్షకులను అలరించడంలో అంత ప్రభావం చూపలేదు. అటువంటి హాస్య నటులు అందరూ ఒకే చోట కలుసుకుంటే కనుల పండగే. తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ కమెడియన్స్ గత కొంత కాలంగా రీయూనియన్ పేరుతో ప్రతి రెండో శనివారం కలస్తూ వస్తున్నారు. అయితే కరోనాతో ఈ కలయికకు బ్రేక్ పడింది. లాక్ డౌన్‌తో దాదాపు ఓ ఏడాది తర్వాత ఇటీవల మళ్ళీ కలిశారు. ఇందులో భాగంగా గత శనివారం మణికొండలో వెన్నెలకిశోర్, శ్రీనివాసరెడ్డి, రఘు కారుమంచి, సప్తగిరి, సత్య, సత్యం రాజేశ్, చిత్రం శ్రీను, ప్రవీణ్, ధనరాజ్, వేణు, తాగుబోతు రమేశ్ ఈ రీయూనియన్‌లో పాలు పంచుకున్నారు. ఇకపై ప్రతి రెండో శనివారం తమ కలయిక ఉంటుందంటున్నారు ఈ కామెడీ స్టార్స్. తమ ఈ కలయిక తామందరిలో ఆత్మవిశ్వాశాన్ని, ఎనర్జీని పెంపొందిస్తుందన్నది వారి భావన. ఈ కలయిక కేవలం ఎంటర్ టైన్ మెంట్‌కే పరిమితం కాదని సోషల్ ఎవేర్‌నెస్ కోసం కూడా అంటున్నారు. ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలతో పాటు పలు సహాయకార్యక్రమాలకు కూడా వేదికగా నిలుస్తుందంటున్నారు. గతంలో నటి సుభాషిని క్యాన్సర్ వైద్యం కోసం లక్ష రూపాయలు డొనేట్ చేయటం, మనం సైతం కోసం పదివేలు, ఆనారోగ్యంతో ఉన్న డబ్బింగ్ మధు కోసం పదివేలు సాయం అందించారు ఈ కమెడియన్స్. అంతే కాదు ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న నటీనటుల పిల్లల వైద్య, విద్యకు కూడా సాయం అందిస్తున్నారు. గతంలోలా ఇకపై ఈ రీయూనియన్ సందర్భంగా డ్రెస్ కోడ్ పాటిస్తామని అంటున్నారు ఈ యంగ్ కమెడియన్స్.