పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ..! నోటిఫికేషన్ ఉంటుందా? లేదా..?
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది ఎస్ఈసీ.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి లేఖరాశారు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణ ఆపాలని కోరారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ, వ్యాక్సినేషన్ కారణంగా ఇప్పుడు సాధ్యం కాదని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ప్రభుత్వ విజ్ఞప్తితో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వెనక్కి తగ్గుతారా..? లేక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక, నోటిఫికేషన్ విడుదల చేసే కార్యక్రమానికి హాజరుకావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌లకు నిమ్మగడ్డ లేఖలు రాశారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్ అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖ అధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.. ఈ నోటిఫికేషన్ జారీ అయ్యాక ఈ నెల 25న ఆయా జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఎన్నికల నోటీసులు విడుదల చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉత్కంఠగా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)