హ్యపీ బర్త్‌ డే ఏసుదాస్..

హ్యపీ బర్త్‌ డే ఏసుదాస్..

తెలుగునాట ఏసుదాస్ గానబంధం
 మధురం ఏసుదాస్ గానం...
మరపురానిది దాసు గళజాలం...
తెలుగువారిని విశేషంగా అలరించిన తెలుగేతర గాయకుడు ఏసుదాస్...
జనవరి 10న ఏసుదాస్ పుట్టినరోజు... సంగీత ప్రియులకు పండుగ రోజు... 
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి  మరీ పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు... మళయాళ సీమలో పుట్టినా తెలుగు పాటకు అమృతం అద్దిన ఏసుదాస్ అంటే మనవాళ్ళకు ప్రాణం...  ఆయన పాటతో మన అనుబంధం ఆరంభమైన తీరును మననం చేసుకుందాం... 

నిండుచందమామ... తొలి పాట
'ఏ స్నేహం ఏ జన్మవరమో...' అన్నారు... నిజమే ఏసుదాసు గానంతో ఏ నాటి బంధమో తెలుగువారిది... ఆయన గళంలోని మాధుర్యాన్ని తెలుగువారికి మొట్టమొదట పరిచయం చేసిన ఘనత సంగీత దర్శకులు ఎస్పీ కోదండపాణికే దక్కుతుంది... కాంతారావు హీరోగా రూపొందిన 'బంగారు తిమ్మరాజు'లో తొలిసారి ఏసుదాస్ నోట తెలుగుపాట పలికింది...  నిండుచందమామ ఆకాశన వెలసిన వేళ జనం మదిలో ఆనందాల హేళ సాగుతుంది... అదే తీరున ఏసుదాస్ తొలి పాట ఈ నాటికీ పరమానందం పంచుతోంది...

యన్టీఆర్ ఆదరణ!
ఏసుదాస్ మధురగానం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది... అయినా తెలుగునాట ఆరంభంలో ఏసుదాస్ కు ఆట్టే అవకాశాలు లభించలేదు... అప్పట్లో మహానటుడు యన్టీఆర్ కు 'మారిన మనిషి'లో తొలిసారి ఏసుదాస్ నేపథ్యగానం చేశారు...
'మారిన మనిషి' తరువాత ఏసుదాస్ లోని గాయకుణ్ని యన్టీఆర్ ప్రోత్సహించారు... తన  సొంత చిత్రాలు 'శ్రీకృష్ణ సత్య, కులగౌరవం'లలో ఏసుదాస్ తో పాటలు పాడించారు... ఈ నాటికీ 'శ్రీకృష్ణ సత్య'లోని ఏసుదాస్ పాట తెలుగునేలపైని రామాలయాల్లో మారుమోగుతూనే ఉంటుంది... 
యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రాన్ని ఆరంభించారు... ఆ చిత్రంలోనూ ఏసుదాస్ తన మధురగళంతో అలరించారు... ఈ చిత్రం  రామారావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో విడుదలయింది. అందులో ఏసుదాస్ గళంలో జాలువారిన శ్లోకాలు జనాన్ని అలరించాయి.. దుష్యంతుని పాత్రధారి బాలకృష్ణకు ఇందులో ఏసుదాస్ చేసిన గానం మురిపించింది... యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ సోలో హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం 'సాహసమే జీవితం'... ఇందులో ఓ పాట మినహా అన్నీ ఏసుదాస్ తోనే పాడించడం విశేషం... 
అనుకున్నవన్నీ జరిగితే మనిషిని మానవుడు అనలేం... రామారావు చిత్రాల్లో ఏసుదాస్ పాటలు పాడినా ఒకే ఒక్క 'శ్రీకృష్ణ సత్య' సూపర్ హిట్ గా నిలచింది... మిగిలినవి అంతగా అలరించలేదు... విజయం చుట్టూ ప్రదక్షిణ చేసే చిత్రసీమలో ఏసుదాస్ మధురగానాన్ని అందరూ అభిమానించారే కానీ, అవకాశాలు కల్పించలేకపోయారు... అదే జీవితంలోని విచిత్రం...  కానీ ప్రతిభావంతులకు జయాపజయాలతో నిమిత్తం లేకుండా అవకాశాలు లభిస్తాయని ఏసుదాస్ గానమే తరువాతి రోజుల్లో నిరూపించింది... 

సత్యం ప్రోత్సాహం...
ఏసుదాస్ ను సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి తెలుగు చిత్రసీమకు  పరిచయం చేశారు. తరువాత ఆయనను ఎక్కువగా ప్రోత్సహించింది సంగీత దర్శకుడు సత్యం. 
 సత్యం తాను స్వరకల్పన చేసిన అనేక చిత్రాలలో  ఆయనతో పాటలు పాడించారు... 
 తరువాత ఏసుదాస్ ను ప్రోత్సహించిన వారిలో నటుడు, రచయిత, దర్శకుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు... ఆయన సంబంధిత చిత్రాలలో అదేపనిగా  ఏసుదాస్ తో పాటలు పాడించేవారు...  

అందరి నోట ఏసుదాస్ పాట
ఏసుదాస్ పాటంటే ప్రాణం పెట్టేవారి సంఖ్య  నిదానంగా తెలుగునాట పెరగసాగింది... దాంతో పలువురు సంగీత దర్శకులు ఏసుదాస్ తో తమ చిత్రాలలో ప్రత్యేక పాటలు పాడించాలని పరవశించారు... ఏయన్నార్ 200వ చిత్రంగా తెరకెక్కిన దాసరి 'మేఘసందేశం'లో ఏసుదాస్ గానం ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ఆయనను నిలిపింది... 
తెలుగు చిత్రసీమలో యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, మురళీమోహన్,చంద్రమోహన్, నాగార్జున, వెంకటేశ్ అందరికీ ఏసుదాస్ నేపథ్యగానం చేసి అలరించారు. 

మోహన్ బాబుతో అనుబంధం..
మోహన్ బాబు కెరీర్ అటూ ఇటూగా ఊగిసలాడుతున్న సమయంలో సొంత చిత్రంగా 'అల్లుడుగారు' నిర్మించారు. ఈ సినిమాలో ఏసుదాస్ పాడిన పాటలు ఆ రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించాయి. ముఖ్యంగా ఏసుదాస్ నోట అన్నమయ్య  కీర్తన, త్యాగరాజు కృతి పలికిన తీరు సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దాంతో కళాతపస్వి  కె.విశ్వనాథ్ కూడా 'శ్రుతిలయలు'లో ఏసుదాస్ తో పాట పాడించి, జనాన్ని ఆనందింప చేశారు. ఇక మోహన్ బాబుకు మరపురాని సక్సెస్ ను అందించిన ఏసుదాస్ ఓ సెంటిమెంట్ గా మారారు. 'అల్లుడుగారు' తరువాత నుంచీ మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలలో ఏసుదాస్ పాటకు చోటు కల్పించేవారు. మోహన్ బాబు కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలచిన 'పెదరాయుడు'లోనూ ఏసుదాసు పాట సందడి చేసింది. మిగిలిన పాటలన్నీ ఓ ఎత్తు, ఏసుదాస్ పాడిన పాట ఒక్కటీ ఓ ఎత్తులా సాగింది. ఆ తరువాత కూడా మోహన్ బాబు చిత్రాల్లో ఏసుదాస్ పాట అలాగే నిలచింది.  తామిద్దరిదీ అన్నదమ్ముల అనుబంధం అంటారు ఏసుదాస్. 

చిరంజీవి సైతం...
మోహన్ బాబులాగే చిరంజీవి సైతం ఏసుదాస్ పాటతో పయనించారు... తన తొలి సొంత చిత్రం 'రుద్రవీణ'లో ఏసుదాస్ తో కొన్ని పాటలు పాడించుకున్నారు... ఇందులో కథానాయకుడు గాయకుడు కావడం, కథానుగునంగా ఏసుదాస్ పాటలు సాగడం జరిగాయి... ఈ పాటలూ సంగీతప్రియులకు కర్ణానందం కలిగిస్తున్నాయి... 

అందరికీ ఆనందం పంచిన గళం...
వెంకటేశ్ ను మహిళా ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన చిత్రాలు 'పవిత్ర బంధం, పెళ్ళిచేసుకుందాం' - ఈ చిత్రాలలో ఏసుదాస్ పాటలను ఎవరు మాత్రం మరచిపోగలరు... నాగార్జున వర్ధమాన కథనాయకునిగా సాగుతున్న రోజులలో రూపొందిన 'సంకీర్తన'లోనూ ఏసుదాస్ పాటనే హైలైట్ గా నిలచింది. ఇక అనువాద చిత్రాల్లోనూ ఏసుదాస్ పాటలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. వర్ధమాన కథానాయకులకూ ఏసుదాస్ పాటనే దన్నుగా నిలచి మురిపించిన సందర్భాలు బోలెడున్నాయి... ఇలా చెప్పుకుంటూ పోతే ఏసుదాస్ పాటలోని మాధుర్యానికి అంతే లేకుండా సాగుతుంది. ఏసుదాస్ గానం నిజంగా స్వరరాగ గంగాప్రవాహమే... అది జీవగంగ ... ఆ మధురానికి అంతులేదు... అది మన సొంతమయినందుకు ఆనందిద్దాం...