‘అయ్యప్ప జ్యోతి’లో పాల్గొన్న వేలాది భక్తులు

‘అయ్యప్ప జ్యోతి’లో పాల్గొన్న వేలాది భక్తులు

అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కేరళ వాసులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. హిందూత్వ వర్గాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో సహా లక్షలాది భక్తులు అయ్యప్ప జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశం కల్పించేందుకు ఎల్డీఎఫ్ సర్కార్ పదేపదే చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా బుధవారం సాయంత్రం రోడ్లపై దీపాలు వెలిగించి నిలబడ్డారు. శబరిమల దేవస్థానంలో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంస్కృతిసంప్రదాయాలని కాపాడాలని కోరారు. కొన్నిచోట్ల మహిళా ప్రదర్శకులపై దాడులు జరిగినట్టు తెలిసింది. ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ సంఘ్ పరివార్ చేస్తున్న ప్రదర్శనలకు ధీటుగా ఎల్డీఎఫ్ ప్రారంభించిన ఉమెన్స్ వాల్ ని అడ్డుకొనేందుకు బీజేపీ మద్దతిస్తున్న శబరిమల కర్మ సమితి ఈ అయ్యప్ప జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించింది. 

వివిధ హిందూ సంస్థలకు చెందిన అయ్యప్ప భక్తులు, స్వచ్ఛంద సేవకులు వేలసంఖ్యలో దీపాలు వెలిగించి జిల్లాతో జిల్లాను కలుపుతూ మానవహారంగా నిలబడ్డారు. కాసర్గోడ్ లోని మంజేశ్వరం నుంచి కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని కన్యాకుమారి జిల్లా కలియాకవిలై వరకు రోడ్డుకిరువైపులా దీపాలు వెలిగించారు. ఇదే మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1న వనిత మతిల్ (ఉమెన్స్ వాల్) ని నిర్వహించాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ లతో పాటు రాష్ట్రంలోని బలమైన నాయర్ కులానికి ప్రాతినిధ్యం వహించే కుల సంస్థ.. నాయర్ సర్వీస్ సొసైటీ కూడా అయ్యప్ప జ్యోతిలో పాల్గొంది. ప్రభుత్వం తలపెట్టిన ఉమెన్స్ వాల్ మతాల గోడ అని ఎన్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది.

పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో 69 కేంద్రాల్లో అయ్యప్ప జ్యోతి నిర్వహించారు. మాజీ డీజీపీ టీపీ సెంకుమార్, కేరళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ కెఎస్ రాధాకృష్ణన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని తిరువనంతపురంలోని సెక్రటేరియట్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై, మరో నేత శోభా సురేంద్రన్, ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ దీపాలు వెలిగించారు.