రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదయింది. గురువారం తిరుమల శ్రీవారికి రూ.6.28 కోట్ల హుండీ ఆదాయం భక్తుల నుండి కానుకలుగా అందాయి. ఒక్కరోజే రూ.6.28 కోట్ల హుండీ ఆదాయం రావడం శ్రీవారి ఆలయ చరిత్రలోనే తొలిసారని అధికారులు తెలిపారు. ఇందులో 1.64 కోట్ల విలువైన చిల్లర నాణేలు ఉన్నాయి. ఇక హర్ష టయోటా చీఫ్ హర్షవర్ధన్ రూ.12 లక్షలు ఖరీదు చేసే వాహనంను స్వామికి విరాళంగా ఇచ్చారు. ఈ రోజు స్వామిని దర్శించుకున్న ఆయన డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌‌కు వాహన తాళాలను అప్పగించారు.

దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఇంత మొత్తంలో స్వామివారికి భక్తుల నుండి కానుకలు వచ్చాయి. ఇంతకుముందు 2012 శ్రీరామనవమి(ఏప్రిల్ 1) సందర్భంగా వచ్చిన రూ.5.73 కోట్లే అత్యధికం. ఆ తర్వాత పెద్ద నోట్లు రద్దు తర్వాత 2017 మార్చి 28 న రూ.5 కోట్లకు పైగా హుండీ ద్వారా ఆదాయం లభించింది. 1990 నుంచి తిరుమల స్వామివారికి కానుకలు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. నగదుతో పాటు వెండి, బంగారం, ఆభరణాలు, ఇతర కానుకలను కూడా భక్తులు అధిక మొత్తంలో స్వామివారికి సమర్పించుకుంటున్నారు.