40 ఏళ్ళ  'తిరుగులేని మనిషి'...

40 ఏళ్ళ  'తిరుగులేని మనిషి'...

నటరత్న యన్.టి.రామారావుతో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన వారిలో కె.రాఘవేంద్రరావు ఒకరు. రామారావుతో రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాల సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. 'అడవిరాముడు' (1977)లో ఆరంభమైన యన్టీఆర్, రాఘవేంద్రరావు జోడీ రామారావు చివరి చిత్రం 'మేజర్ చంద్రకాంత్' (1993) దాకా సాగింది. ఈ మధ్యలో వారిద్దరి కలయికలో రూపొందిన 12 చిత్రాలలో ఏకైక అట్టర్ ఫ్లాప్ మూవీ 'తిరుగులేని మనిషి'. ఈ చిత్రం 1981 ఏప్రిల్ 3న విడుదలయింది. మరి ఈ పరాజయం పాలయిన చిత్రాన్ని ఎందుకని గుర్తు చేసుకోవాలి? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎందుకంటే, కొన్నిసార్లు ఎంత సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ కుదిరినా, కథలో విషయం లేకుంటే పరాజయం పాలు కాకతప్పదన్న సత్యం తెలుసుకోవడానికి. అక్కడా ఇక్కడా పోగేసిన అంశాలతో ఓ కథను రూపొందించి, ఘనవిజయాలను సొంతం చేసుకొనే విద్య  రాఘవేంద్రరావుకు కొత్తేమీ కాదు. అలా పోగేసిన కథతో రూపొందిన చిత్రమే 'అడవిరాముడు'. ఆ సినిమా అఖండ విజయం తరువాత కూడా రామారావుతో "డ్రైవర్ రాముడు, వేటగాడు, గజదొంగ"వంటి జనరంజక చిత్రాలను తెరకెక్కించారు రాఘవేంద్రరావు. అదే పంథాలో పయనించినా, కథలో పట్టు లేకపోవడంతో హిట్టు అనే ఉట్టికొట్టలేకపోయింది 'తిరుగులేని మనిషి'. 

అంతకు ముందు యన్టీఆర్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే 'కేడీ నంబర్ వన్' చిత్రాన్ని నిర్మించారు కె.దేవీ వరప్రసాద్. 'తిరుగులేని మనిషి' చిత్రాన్ని కూడా యన్టీఆర్, కె.ఆర్.ఆర్. కాంబోలోనే తెరకెక్కించారు. అప్పట్లో అందాల నాయికగా నాజూకు షోకులతో అలరిస్తున్న రతి అగ్నిహోత్రిని ఇందులో నాయికగా ఎంపిక చేసుకున్నారు. అంతకు ముందు యన్టీఆర్, రాఘవేంద్రరావు చిత్రాలకు పనిచేసిన మేటి సాంకేతికనిపుణులే పనిచేశారు. అయినా లాభం లేకపోయింది. "నిన్ను పుట్టించినోడు బ్రహ్మదేవుడు..." అనే పాట, "మధురం మధురం..." అంటూ సాగే మరోపాట అలరించాయి. 

యన్టీఆర్ తో చిరంజీవి...
ఈ చిత్రంలో యన్టీఆర్ చెల్లెలుగా ఫటాఫట్ జయలక్ష్మి నటించింది. ఆమె భర్తగా చిరంజీవి నటించారు. యన్టీఆర్ తో చిరంజీవి నటించిన ఏకైక చిత్రం ఇదే. ఈ సినిమా సమయానికి చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకుడే! ఇందులో చిరంజీవిపై "ఎంతసేపు ...ఎంతసేపు..." అనే పాటను చిత్రీకరించారు. తరువాత యన్టీఆర్, రతి, చిరంజీవి కాంబినేషన్ లో  "యవ్వనం...ఒక నందనం..." అనే గీతాన్నీ తెరకెక్కించారు. కేవీ మహదేవన్ స్వరకల్పనలో రూపొందిన ఆరు పాటలను ఆచార్య  ఆత్రేయ రాశారు. సత్యానంద్ మాటలు సమకూర్చారు. ఏ విషయంలోనూ 'తిరుగులేని మనిషి' ఆకట్టుకోలేకపోయింది. అందుకే మళ్ళీ 'తిరిగిచూడకుండా పోయింది' అని అభిమానులే ఎద్దేవా చేసిన సినిమాగా ఇది మిగిలింది.