రివ్యూ: తిప్పరా మీసం 

రివ్యూ: తిప్పరా మీసం 

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్యర్ త‌దిత‌రులు

మ్యూజిక్:  సురేష్ బొబ్బిలి 

సినిమాటోగ్రఫీ: సిధ్ 

నిర్మాత: రిజ్వాన్ 

దర్శకత్వం : ఎల్ కృష్ణ విజయ్ 

విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు తీసే శ్రీవిష్ణు తిప్పరా మీసం పేరుతో ఓ వినూత్నమైన కథతో సినిమాను చేశాడు.  దీనికి ముందు శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా సినిమా చేసి మెప్పించాడు.  ఆ సినిమా మంచి విజయం సాధించింది.  అదే కోవలో డిఫరెంట్ గా ఉండే కథను ఎంచుకొని సినిమా చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ రోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.  

కథ: 

శ్రీ విష్ణు డీజేగా వర్క్ చేస్తుంటాడు. అయితే, చిన్న తనం నుంచి మత్తు పదార్ధాలకు బాసిన కావడంతో శ్రీ విష్ణును చికిత్స కోసం పునరావాస కేంద్రంలో జాయిన్ చేస్తారు.  అక్కడ విష్ణు ఒంటరి అవుతాడు. దీంతో శ్రీ విష్ణు అతని తల్లి రోషిణిపై పగను పంచుకుంటాడు.  చికిత్స నుంచి బయటకు వచ్చిన తరువాత విష్ణు తల్లి దూరంగా ఉంటూ డీజేగా పనిచేస్తూ ఉంటాడు.  ఈ క్రమంలో జూదం కూడా అలవాటు అవుతుంది.  ఈ జూదంలో ఓ బుకీకి రూ. 30 లక్షల రూపాయలు అప్పు పెడతాడు.  ఆ అప్పును తీర్చాలంటే తన ఆస్తిని అమ్మాలి.  దానికోసం శ్రీ విష్ణు తిరిగి తన తల్లి దగ్గరకు వెళ్తాడు.  కానీ, తల్లి ఆస్తిని ఇవ్వకుండా ఐదు లక్షల రూపాలకు చెక్ ఇస్తుంది.  అది కాస్త బౌన్స్ అవుతుంది.  దీంతో తల్లిపై కేసు పెడతాడు.. ఆ కేసులో ఎవరు గెలిచారు అన్నది కథ 

విశ్లేషణ: 

ఇప్పటి సినిమాల్లో కథ కంటే కథనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  వారి ఆలోచనలకు అనుగుణంగా హీరోలు సినిమాలు చేస్తున్నాడు.  హీరో శ్రీవిష్ణు కూడా అదే నమ్మకంతో సినిమా చేశాడు. అయితే, ఇందులో కథ లేదు.. అంతకు మించి కథనాలు కూడా చెప్పుకునే విధంగా లేకపోవడంతో సినిమా డీలా పడింది.  సినిమాలో క్లైమాక్స్ మినహా సినిమా మొత్తం పెద్దగా ఏమి అనిపించలేదు.  ఫస్ట్ హాఫ్ మొత్తం సాగతీసినట్టుగా ఉన్నది.  హీరో  మ‌త్తుకి బానిసై చేసే విన్యాసాలు, దుస్తులు విప్పేసి రోడ్ల మీద ప‌రుగెత్తడాలు, అత‌ను ఆడే జూదం.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది.  సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఏమి లేదు.  ఈ సినిమాకు తిప్పరా మీసం అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు.  క్లైమాక్స్ కోసమే సినిమా చేసినట్టుగా అనిపిస్తోంది.  

నటీనటుల పనితీరు: 

శ్రీవిష్ణు నటన ఆకట్టుకునే విధంగా.. నెగెటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించాడు.  తల్లి పాత్రలో రోషిణి మెప్పించింది.  మిగతా నటీనటులు వారి పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

సాంకేతికంగా సినిమా కాస్త పర్వాలేదనిపించింది.  మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది.  నైట్ ఎఫెక్ట్స్ ను బాగా వర్కౌట్ చేశారు.  కథనాల్లో వేగం లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. 

బలాలు : 

శ్రీ విష్ణు 

క్లైమాక్స్ 

బలహీనతలు : 

కథ, 

కథనం 

ఎమోషన్స్ 

సాగతీత 

చివరగా: శ్రీవిష్ణు మీసం తిప్పలేకపోయాడు