ISI కుట్ర...డ్రోన్‌ కెమెరాలతో పటిష్ట నిఘా !

ISI కుట్ర...డ్రోన్‌ కెమెరాలతో పటిష్ట నిఘా !

ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేసేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆ రోజున భారీ విధ్వంసానికి ప్లాన్‌ చేసినట్టు గుర్తించాయి. దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. అయోధ్యలో భూమి పూజ నిర్వహించబోయే రోజు... జమ్మూకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5 ... రెండూ ఒకటే కావడంతో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని పోయినేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 

రామమంది నిర్మాణానికి ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ, ఉమా భారతితో పాటు ఆరెస్సెస్‌ అగ్ర నేతలు, దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో, ఇప్పటికే ప్రధాని హెలికాప్టర్‌‌ ల్యాండయ్యే సాకేత్‌ మహా విద్యాలయం నుంచి రామ జన్మభూమి స్థలం వరకు భద్రతా దళాలు భారీగా మోహరించాయి. రామ్‌కోట్‌ ప్రాంత నివాసితుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక పాస్‌లను సైతం జారీ చేశారు. ప్రతిరోజూ భద్రతా బలగాలు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడంతో పాటు ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరాలతో కూడా నిఘా పెట్టారు.