తెలకపల్లి రవి : విగ్రహాల ధ్వంసం, విద్వేష ప్రచారం నివారణ

తెలకపల్లి రవి : విగ్రహాల ధ్వంసం, విద్వేష ప్రచారం నివారణ

విజయనగరం జిల్లా రామతీర్థంలో బోడికొండ రాముడి విగ్రహం శిరస్సు ధ్వంసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఆలయాలపై దాడుల వివాదాన్ని పరాకాష్టకు చేర్చింది. ఘటన బయిటకు రాగానే టిడిపి వైసీపీ  బిజెపి నేతలు అక్కడకు చేరుకోవడం రాజకీయాన్ని రగిల్చింది. ఆలయాల భద్రత, విగ్రహాల సంరక్షణపై ప్రభుత్వం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టవసిన అవసరాన్ని ఈ ఘటన అందరూ గుర్తించేలా చేసింది. అంతర్వేది రథం దగ్ధం నాటి నుంచి అదేపనిగా సాగుతున్న ఈ దాడులు, ధ్వంసాలు, దుర్మార్గాలు  ఒక పథకం ప్రకారమే జరుగుతున్నాయని, వీటి వెనక ఖచ్చితమైన కుట్ర శక్తులు, అరాచక శక్తులు వుండాలని అందరూ భావించారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, బిజెపీ మాత్రం ఇదేదో క్రైస్తవ హిందూ సమస్యగా  ప్రచారం చేశాయి. ముఖ్యమంత్రి జగన్‌ క్రైస్తవ విశ్వాసాలను ఇందుకు కారణంగా చూపించాయి. ప్రభుత్వం కూడా వందకు పైగా ఘటను జరుగుతున్నా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని వేసి నిగ్గు తేల్చే బదులు తాత్కాలిక చర్యలతో అరకొర వివరణతో సరి పెట్టింది. 

ఒకటి రెండు చోట్ల మాత్రం తాగుబోతులు, పిచ్చి వాళ్లు ఇందుకు కారణమని పోలీసు వెల్లడించారు. ఇలాటి సమయంలో రామ తీర్థం ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఆ మరుసటి రోజునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడకు పర్యటన పెట్టుకోవడము,దాని కన్నా ముందే వైసీపీ నేత విజయసాయి రెడ్డి పర్యటన, ఈ మధ్యలో బిజెపి ఎంఎల్‌సి మాధవ్‌ నిరసన అన్నీ కలిసి అట్టుడికించాయి. ముందే చెప్పినట్టు ఈ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై దాడులను నిర్లక్ష్యం చేస్తున్నట్టు, ఇంకా చెప్పాంటే పాలకుల ప్రోద్బంతోనే ఇవన్నీ జరుగుతున్నట్టు టిడిపి నేతలు ఆరోపించారు. రామతీర్థం ఘటనలో కొండపై ఉద్యోగులుగా వున్న స్థానిక టిడిపి నేతలను పట్టుకోవడాన్ని మాత్రం వారు తప్పు పట్టారు. దీనిపై విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్సాసత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఎదురు దాడి చేశారు. టిడిపి వారే ఇవన్నీ చేయించి రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎస్పీ రాజకుమారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇన్ని ఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్‌ నోరు విప్పలేదనేది ఒక ప్రధానమైన ఆరోపణగా వుండి పోయింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో  తొలి పోలీసు డ్యూటీ మీట్‌ ప్రారంభాన్ని సందర్భం చేసుకుని జగన్‌ ఆలయాలపై దాడుల సమస్య గురించి వివరంగా మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు మంచి కార్యక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకు  రాజకీయ ప్రత్యర్థులు కావాలనే కుట్రపన్ని అందుకు కాస్త ముందుగా ఇలాటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు మద్దతుగా తేదీలు కూడా వరుసగా చదివి వినిపించారు, రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వదలిపెట్టకుండా దాడి చేస్తున్న ఈ శక్తులు ఎలాటివో తెలుసు కోవాలని టిడిపి గురించి సూటిగానే విమర్శించారు. టిడిపి వారి ప్రవేటు ఆలయాల్లోనే ఎక్కువ విధ్వంసాలు జరిగాయని చెప్పారు. మారుమూల ప్రాంతాలోని గుళ్లను ఎంచుకుని అర్థరాత్రి వేళ దాడి చేసి ఉదయాన్నే రభస చేయడం  ఒక రాజకీయ గెరిల్లా తంత్రాన్ని తలపిస్తున్నదని ముఖ్యమంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

తిరుమలలో కార్యక్రమం లైటింగ్‌లో పూర్ణకుంభం అమరిస్తే దాన్ని దూరం నుంచి తీసి శిలువలా చూపించే కుట్ర పన్నారంటూ క్రైస్తవ హిందూ తగాదాగా చూపే ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. వీటిపై ఖచ్చితంగా నిఘా వేసి పట్టుకుంటామని దోషులు ఎంతటివారైనా వదలి పెట్టబోమని జగన్‌ ప్రకటించారు. మత సామరస్యాన్ని శాంతిని కాపాడుకోవడంలో పోలీసు పాత్ర కీలకమని కూడా అన్నారు. మొత్తం పైన మొదటి సారి ఈ అంశం పై స్పందించిన ముఖ్యమంత్రి వివిధ కోణాను సమగ్రంగానే ప్రస్తావించారు. మొదటిసారిగా 20 వే పైగా దేవాలయాలకు లైటింగ్‌ కరెంట్‌ ఏర్పాటు చేస్తున్నామని సిసి కేమెరాలు అమరుస్తామని ప్రకటించారు. రామ తీర్థం ఘటనపై సిఐడి విచారణ జరిపిస్తామని ఇతర ఆయా సంగతి కూడా దర్యాప్తు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వ్లెంపల్లి తర్వాత ప్రకటించారు. నిజం గానే ప్రభుత్వం ఆ విధమైన కఠిన చర్యలు తీసుకుని ఈ కుటి శక్తులు కుట్రలు వమ్ము చేయవలసిన అవసరముంది. మా ప్రభుత్వానికి మేమే ఎందుకు చెడ్డపేరు తెచ్చుకుంటామని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్న సమంజసమైందే.

కాకపోతే జగన్‌ తన వ్యాఖ్యలతో ఎక్కడా బిజెపిని పెద్దగా ప్రస్తావించకపోవడం విశేషం, ప్రతిపక్షాలు అని మాత్రం అన్నారు. వాస్తవానికి సోము వీర్రాజు ఎపిలోనూ బండి సంజయ్‌ తెంగాణలోనూ బిజెపి అద్యక్షులయ్యాకనే ఈ వాతావరణం మరింత ప్రబలినది, ఆయా ఘటనల పై బిజెపి నేతలతో పాటు జనసేన పవన్‌ కళ్యాణ్‌ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీలు రేపు ధర్మ దీక్ష ప్రకటించారు కూడా. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో పోటీ పెట్టి మాట్లాడటం ఈ మొత్తం వ్యవహారంలో పరిపాటిగా మారింది. బండి సంజయ్‌ అయితే మరో అడుగు వేసి ఏపీలో బైబిల్‌కూ భగవద్గీతకు మధ్యన తేల్చుకోవలసిన సమయం వచ్చిందన్నారు. దుబ్బాక టు తిరుపతి వయా జిహెచ్‌ఎంసి అని గతంలో ఇదే శీర్షికలో అన్నట్టు రెండు రాష్ట్రాల్లోనూ  ఆలయాలు మత రాజకీయాలు బిజెపి తారకమంత్రంగా మారాయి. 

ఇంకా చెప్పాలంటే తమ ఆయా అజెండాను టిడిపి హైజాక్‌ చేస్తున్నదనే కినుక కూడా బిజెపిలో కనిపిస్తున్నది. ఎన్నడూ లేనిది ఆ పార్టీ ఆయా సమస్యను రాజకీయం చేయరాదని చెప్పడం ఇందుకు ఓ ఉదాహరణ, అయితే రేపు బిజెపి జన సేన ధర్మదీక్షలో  ప్రసంగాలు తీవ్రం గానే  ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ సమయంలో జగన్‌ ప్రభుత్వం ఆలయాలలో దాడులకు కారకులైన వారిని పట్టుకోవడంలోనూ, భద్రత కల్పించడంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం, మంత్రి చెబుతున్న సిఐడి దర్యాప్తుతో పాటు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలి. రాజకీయ అనుబంధాలతో సామాజిక స్థానాలతో నిమిత్తం లేకుండా అనుమానితులను దోషులను బయిటపెట్టాలి. అసలు ఇవన్నీ ఏ పద్ధతిలో జరిగాయో వివరమైన పత్రం ప్రకటించాలి, మతసామరస్యాన్ని లౌకిక తత్వాన్ని పెంచేందుకు  ప్రచారం కార్యక్రమాలు నిర్వహించాలి. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ  కుటిల చర్యను రాజకీయ కోణంతో చూడటం గాక శాంతి సామరస్యాల పరిరక్షణే కీలకమని గుర్తించాలి. విద్యాధికులు విజ్ఞులైన ప్రజలు విష ప్రచారాలను పన్నాగాలను వమ్ము చేసి విశాల ఐక్యతను చాటిచెప్పాలి.