తెలకపల్లి రవి విశ్లేషణ : ఆర్నాబ్‌ ఉదంతం-స్వేచ్చలో రెండుకోణాలు    

తెలకపల్లి రవి విశ్లేషణ : ఆర్నాబ్‌ ఉదంతం-స్వేచ్చలో రెండుకోణాలు    

రిపబ్లిక్‌ టీవీ అధినేత ఆర్నాబ్‌ గోస్వామిని ఒక డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టు చేయడం రెండు కోణాల్లో  చర్చకు కారణమైంది. మహారాష్ట్ర స్థానిక కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా పయనించింది. ఎన్నడూ లేనిది దేశ హోం మంత్రి అమిత్‌షా ఇది పత్రికా స్వేచ్చకు హాని అని ఎమర్జన్సీని గుర్తు చేస్తున్నదని ప్రకటన చేశారు. నటుడు  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యలో ఏ ఆధారాలు లేకున్నా అంత హడావుడి చేసిన వారు  ఆర్నాబ్‌ గోస్వామి తన భర్త  పేర్లతో సహా లేఖ రాసి చనిపోతే ఎందుకు చర్య వద్దంటున్నారని అన్వయ్‌ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరెస్టు పత్రికా వృత్తికి సంబంధించింది  కాదనీ పాత ఫిర్యాదుపై ఆధారాతో చేసింది. ఈ కేసు మెజిస్ట్రేట్‌ కోర్టు ముందకు వచ్చినప్పుడు ఆర్నాబ్‌ వ్యవహరించిన తీరు, దూకుడుపై న్యాయమూర్తి ఆగ్రహం వెలిబుచ్చాల్సి వచ్చింది.  దీనికి ముందు వెనక  నాటకీయ పరిణామాలే నడిచాయి.  బీహార్‌ ఎన్నికలో ఎదురుగాలి తట్టుకోవడానికి నటుడు   సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషాదాంతం   ఆధారం చేసుకోవాలని నితిశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమి భావించగా అక్షరాలా అందుకు తగినట్టే కంగనా రనౌత్‌ను ముందుంచి ఆర్నాబ్‌ షో నడిచింది.  బాలివుడ్‌పైనే దాడిగా మారింది.

అయితే ఈ కేసు సిబిఐకి అప్పగించినా  ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్య నివేదికలో స్పష్టం కావడంతో కథ మొదటికి వచ్చింది. హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం ఉదంతం సమయంలో వీక్షకుల దృష్టి మళ్లించడానికి  ఇదంతా కాలవానే జరిగినట్టు స్పష్టమైపోయింది. ఇలాంటి తరుణంలోనే ముంబాయి పోలీసులు టిఆర్‌పి కుంభకోణం  వెలికితీశారు. ఇందులోనూ మరో రెండు మరాఠీ చానళ్లతో పాటు  రిపబ్లిక్‌ టీవీ ముందుగా దొరికిపోయింది. తమపై ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేసినందుకు అర్నాబ్‌ గోస్వామిపై బాలివుడ్‌ హేమాహేమీలు అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, మహేష్‌ భట్‌ తదితరులందరూ దావా వేశారు. ఆర్నాబ్‌ కూ మహారాష్ట్రలోని శివసేనకూ మధ్య మొదలైన ఈ వివాదం క్రమేణా తీవ్ర రూపం తీసుకుంది. 2018 లో ఆత్మహత్య చేసుకున్న  డిజైనర్‌ అన్వయ నాయక్‌ ఆఖరి లేఖలో తనకు అర్నాబ్‌ కంపెనీ  ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వనందు వల్లనే చితికిపోయి చనిపోతున్నట్టు రాశారు.

అప్పుడే ఆయనపై చర్యకు పోలీసులు సిద్ధమైతే  ఢీల్లీలోని బిజెపి పెద్ద జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్‌కు చర్య తీసుకోవద్దని ఆదేశాలు పంపినట్టు చెబుతున్నారు.  ఉధ్ధవ్‌  ఠాక్రే అధికారం చేపట్టాక అన్వయ్‌ కుటుంబ సభ్యులు ఆయనను కలిసి మరోసారి తమకు న్యాయం కావాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర పోలీసులు అర్నాబ్‌ను అరెస్టు చేశారు. ఆర్నాబ్‌ను పోలీసులు  ఆలిగంజ్‌ కోర్టులో హాజరుపర్చగా నవంబరు 18 వరకూ రిమాండ్‌ విధించారు. హైకోర్టు ఆయనకు బెయిలు ఇవ్వడానికి నిరాకరించికింది కోర్టుకే వెళ్లమని చెప్పింది. అక్కడేమి జరిగేది చెప్పలేము. ఆర్నాబ్‌ అరెస్టు విషయంలో పోలీసులు విమర్శలకు అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉందని అంటూనే  మీడియా స్వేచ్చ  ఆయనకే పరిమితం చేయడానికి లేదని దేశంలో మీడియా వర్గాలు ముక్తకంఠంతో వ్యాఖ్యానించాయి.  శ్రీనగర్‌లో కాశ్మీర్‌ టైమ్స్‌ పత్రిక కార్యాయాన్ని ఖాళీ చేయించి దాని ఎడిటర్‌ను వేధించిన ఘటన చూశాం. హత్రాస్‌ అమానుష అత్యాచారంపై చర్యు తీసుకునే బదులు యుపిలోని యోగి ప్రభుత్వం మళయాల జర్నలిస్టు కన్నన్‌ కప్పన్‌ బాధితులను రెచ్చగొడుతున్నారని పోలీసులు కేసు పెట్టారు.

జెఎన్‌యు ఉదంతంలోనూ భీమ్‌ కొరగావ్‌ కేసులోనూ  ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళన సందర్బంలోనూ ఎందరో రచయితలు కమ్యూనిస్టులు దేశద్రోహులుగా చిత్రించబడ్డారు.  అంగవైక్యంతో బాధపడే ప్రొఫెసర్‌ సాయిబాబా, వయోవృద్ధుడైన వరవరరావు, ఆనంద్‌ తెంబుల్డే, స్టాన్స్‌ స్వామి వంటివారు కారాగారంలో మగ్గిపోతున్నారు. వారి బెయిల్‌ పిటిషన్లు విచారించడానికి ఆరోగ్య రక్షణకు కూడా న్యాయస్థానాలు చొరవ చూపడం లేదు. ఎన్‌డిటివి వంటి వాటిపై ఏవేవో ఆర్థిక ఆరోపణలతో వెంటాడిన  ఉదాహరణలు కూడా వున్నాయి. అదే ఆర్నాబ్‌ విషయానికి వచ్చే సరికి మోడీ ప్రభుత్వం మొత్తం రంగంలోకి దిగిపోవడం విచిత్రం! చాలా పత్రిలకు ఈ ద్వంద్వనీతిపై సంపాదకీయలు రాశాయి.  ఆర్నాబ్‌ చర్చలో 70 శాతం విద్వేషంపెంచేదిగా వున్నట్టు  కోటశైజ గతంలోనే పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు నడుస్తుండగానే మహారాష్ట్ర శాసనసభ హక్కు తీర్మానం బెదిరింపు కేసు వచ్చింది. దాంట్లో   సుప్రీం కోర్టు  నవంబరు ఆరున ఆర్నాబ్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది. తన గురించి శాసనసభలో ముఖ్యమంత్రి అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఆర్నాబ్‌  కోర్టులో  ఒక సాక్ష్యాధారం సమర్పించారు. సభాపతి అనుమతి తీసుకోకుండా సభ చర్చను కోర్టులో ఎలా సమర్పిస్తావని  శాసనసభ కార్యదర్శి ఆయనకు లేఖ రాశారు. దీనిపై హక్కు తీర్మానం రావచ్చని హెచ్చరించారు. ఈ లేఖనే ఆర్నాబ్‌    దాఖలు చేస్తూ కోర్టు నుంచి తనకు రక్షణ  కల్పించాని కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాజ్యాంగం 32వ అధికరణం ప్రకారం రాజ్యాంగ న్యాయస్తానంగా వుండే కోర్టు ముందు సమర్పించిన సాక్ష్యాధారంపై ఎలా నోటీసులు ఇస్తారని శాసనసభ కార్యదర్శిపై విరుచుకుపడింది.

మీకెంత ధైర్యం అని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే మండిపడ్డారు. రాజ్యాంగ హక్కు కాపాడకపోతే మేమెందుకంటూ సిజెఐ ఆగ్రహోదగ్రులైనారు.  కోర్టు ధిక్కారం కింద శాసనసభ కార్యదర్శిపై ఎందుకు చర్య తీసుకోవద్దని ప్రశ్నిస్తూ ఒక న్యాయవాదిని ఇందుకు అమికస్‌ క్యూరిగా నియమించింది. ఆ విధంగా ఇది న్యాయవ్యవస్థకూ  చట్టసభలకు మధ్య ఘర్షణగా మారిపోయింది.  ప్రజాస్వామికంగా విమర్శలు చేసే వారందరినీ వెంటాడే మోడీ  ప్రభుత్వం  ఆర్నాబ్‌ గోస్వామి పట్ల ఇంత ప్రత్యేకాసక్తి చూపుతున్నా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ వంటివారు ఈ విషయంలో ఉదాసీనంగా వున్నారు. ఆత్మహత్య చేసుకున్న అన్వయ్‌ నాయక్‌ మరాఠీ కావడం అందుకు కారణం. ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తే సుశాంత్‌ సింగ్‌ కేసులో వ్యూహం బెడిసికొడుతుందని వారు భయపడుతున్నారట. బాలీవుడ్‌ ప్రముఖులు కేసులో సుప్రీం కోర్టు కూడా ఈ రోజు రిపబ్లిక్‌ టివి, టైమ్స్‌-నౌ పై తీవ్ర వ్యాఖ్యలే చేసింది. మీరే విచారణ జరిపేస్తే మేమెందుకని ప్రశ్నించింది.అస్యానికి దారితీసిన అమెరికా అద్యక్ష ఎన్నిక వివాదంతో  సహా ప్రతి సందర్భంలో మీడియా సోషల్‌ మీడియా పాత్ర ప్రశ్నార్థకమవుతున్న తీరు చూస్తూనే వున్నాం. మీడియాలో  ముందున్నామనే కొందరి వివాదాస్పద పోకడకూ, దానిపై పాకు ద్వంద్వనీతులు తెలుసుకోవడానికి అస్మదీయ అర్నాబ్‌ ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా నిలిచిపోతుంది.