విజృంభిస్తోన్న కరోనా... 5 వేల వైపు పరుగులు...!

విజృంభిస్తోన్న కరోనా... 5 వేల వైపు పరుగులు...!

భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేచస్తోంది... దేశంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగు వేలు దాటేసి... 5 వేల వైపు పరుగులు పెడుతోంది... ఇప్పటి వరకు 4,778 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో 145 మందిని మహమ్మారి బలితీసుకుంది. ఇక, గడిచిన 24 గంటల్లోనే 693 కొత్త కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం... మరోవైపు... కేవలం నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చినవారు, వాళ్లకు సంబంధించినవారి కేసులో ఇందులో 1,445 ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా ఊహించని రీతిలో విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 868కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 500 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మృతుల సంఖ్య కూడా ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 52 మంది కరోనాతో కన్నుమూశారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదయితే, పది రోజుల క్రితం వరకూ ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో 571 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు వైరస్ బారిన పడి చనిపోయారు. ఢిల్లీలో 525 మంది కరోనా బారిన పడితే వారిలో ఏడుగురు చనిపోయారు. ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో లాక్‌ డౌన్‌ మూడోవారం కొనసాగుతోంది. కరోనా వ్యాప్తిలో భారత్‌ రెండు, మూడు స్టేజ్‌ల మధ్యలో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా సమూహ వ్యాప్తికి చేరినట్టు గుర్తించామని ఎయిమ్స్‌ డైరెక్టర్ అంటున్నారు.