తమ చాపర్ నే కూల్చేసినట్టు ఎన్నికల తర్వాతే ఎందుకు ఒప్పుకుందో?

తమ చాపర్ నే కూల్చేసినట్టు ఎన్నికల తర్వాతే ఎందుకు ఒప్పుకుందో?

ఫిబ్రవరి 26న భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి పాకిస్థాన్ లోని బాలాకోట్ లక్ష్యాలపై బాంబులు కురిపించాయి. కశ్మీర్ లో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కి చెందిన ఒక ఉగ్రవాది జరిపిన దాడిలో 40 మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. బాలాకోట్ దాడితో సరిహద్దుల్లోని గగన తలంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. తర్వాత రోజు శత్రుదేశ విమానాలను తరిమికొట్టేందుకు భారత వాయు సేన చర్య ప్రారంభించింది. ఇందులో ఒక భారత పైలెట్ ను పాకిస్థాన్ పట్టుకుంది. అలాగే జమ్ముకశ్మర్ లోని బుద్గావ్ లో ఒక హెలికాప్టర్ ను కూల్చేయడంతో ఆరుగురు ఐఏఎఫ్ సిబ్బంది మరణించారు.

రెండు నెలలకు పైగా బుద్గావ్ సంఘటన ఒక మిస్టరీగా మిగిలిపోయింది. నిన్న (మంగళవారం) సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత దళాలు ఒక మిస్సైల్ తో తమ సొంత హెలికాప్టర్ ని కూల్చేయడంతో ఐఏఎఫ్ సిబ్బంది మరణించినట్టు వార్తలు వెలుగు చూశాయి. ఐఏఎఫ్ చాపర్ ను శత్రుదేశ హెలికాప్టర్ గా పొరబడినట్టు ఎన్డీటీవీ తెలిపింది. మిస్సైల్ ప్రయోగానికి బాధ్యుడైన అధికారిపై శిక్షార్హమైన హత్యానేరం ఆరోపించినట్టు ద ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రెండు కథనాలు ఐఏఎఫ్ నిర్వహించిన దర్యాప్తును ఉటంకించాయి. 

వీటి కంటే ముందు ఏప్రిల్ 27న ద బిజినెస్ స్టాండర్డ్ బుద్గావ్ సంఘటనపై ఇచ్చిన వార్తాకథనంలో ఇది స్నేహపూర్వక కూల్చివేత కావచ్చని ఊహిస్తూ ఈ దర్యాప్తు వివరాలు లోక్ సభ ఎన్నికల తర్వాతే వెల్లడవుతాయని చెప్పింది. 'బాలాకోట్ దాడులు, పాక్ ప్రతిచర్య, పాకిస్థానీ ఎఫ్-16 ఫైటర్ కూల్చివేతలను ఎన్నికల ప్రచారంలో భారత ఘనవిజయాలు పేర్కొంటున్న సమయంలో హెలికాప్టర్ నష్టపోవడం, పొరపాటు కారణంగా ఏడు ప్రాణాలు పోయాయని ఒప్పుకోవడం నష్టం కలిగించవచ్చని' కారణాలుగా తెలిపింది. 

ప్రచారంలో బీజేపీ బాలాకోట్ దాడులను వాడుకోవడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు సాయుధ బలగాల గురించి తమ ప్రచారంలో ప్రస్తావించరాదు. అయితే బుద్గావ్ సంఘటన దర్యాప్తును అధికార బీజేపీకి ఇబ్బందులు కలగనీయకుండా సాయుధ దళాలే ఎన్నికలు ముగిసే వరకు రహస్యంగా ఉంచడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్లుగా భారత సైనిక బలగాలను రాజకీయం చేస్తుండటం ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల పలు సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలను నేరుగా విమర్శించేందుకు భారత సైన్యం ముందుకొస్తోంది.