తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ‌ నేతల్లో కేసుల టెన్ష‌న్‌

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ‌ నేతల్లో కేసుల టెన్ష‌న్‌


సుప్రీంకోర్టు ఆదేశాల‌తో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నేతల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. రాజ‌కీయ నేతల‌పై న‌మోదైన‌ క్రిమినల్‌ కేసులతో పాటు ఇర‌త కేసులను త్వ‌రితగిన విచారించేంద‌కు తెలంగాణ హైకోర్టు సిద్ధమైంది. అందులో భాగంగా కోవిడ్ 19 నిబంధ‌న‌ల‌ను పాక్షికంగా స‌డ‌లించిన‌ట్లు హైకోర్టు ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. దీంతో రాజ‌కీయ పార్టీల నేత‌లు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి వ‌స్తుందా లేదా అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సిట్టింగ్‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 223 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితా కూడా చేర్చితే సంఖ్య మరింత పెరుగుతుందని న్యాయ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక సహా చాలా రాష్ట్రాల్లో పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు కేసులు ఎదుర్కొంటుండగా ఈ రాష్ట్రాల్లో కేవలం ఒఫ‌క్కొక్కటి చొప్పునే ప్రత్యేక కోర్టులు ఉన్నాయని అమికస్‌ క్యూరీ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. 

దేశంలో నేర చరితలు కలిగిన నేతలంతా అత్యధికంగా ఉత్తప్రదేశ్‌లోనే ఉన్నారు. మొత్తం 1,217 కేసులుండగా, ఇందులో 446 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. జీవిత ఖైదుకు శిక్షార్హమైన కేసులు 116 ఉన్నట్లు సుప్రీం కోర్టు దృష్టికి వ‌చ్చింది. బీహార్‌లో 531, తమిళనాడు 324, మహారాష్ట్ర 330, ఒడిశా 331, మధ్యప్రదేశ్ 184, ఆంధ్రప్రదేశ్ 106, పశ్చిమ బెంగాల్ 131, కర్ణాటకలో 164 పెండింగ్‌ కేసులున్నాయి. తెలంగాణలో 118 కేసులు ఉండగా... వీటిలో 107 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని, ఈ కేసులన్నీ హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయి.

తెలంగాణలో 2012 నుంచి కేసులు పెండింగులో ఉన్పప్పటికీ అనేక కేసుల్లో నిందితులకు ఇంకా సమ్మన్లు కూడా జారీ చేయలేదని తెలుస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేత‌లు ప్రస్తుతం కొంద‌రు ప్ర‌భుత్వంలో ఉన్న‌త ప‌దవుల్లో ఉన్నారు. మ‌రికొంద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులుగా కొన‌సాగుతున్నారు. అయితే అధికార పార్టీ నేత‌లు త‌మ‌పై ఉన్న కేసుల విష‌యంలో న్యాయ‌స్థానాల‌కు వెళ్లాల్సి వ‌స్తుందేమోన‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంద‌రు నేతలు మాత్రం తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా త‌మ‌పై అక్ర‌మ కేసులు పెట్టార‌ని... విచార‌ణ‌లో తాము ఎలాంటి త‌ప్పుచేయలేద‌ని రుజువు అవుతుంద‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.