వైసీపీ ఎన్డీఏలో చేరితే బీజేపీ నేతలకు ఎందుకు టెన్షన్ ?

వైసీపీ ఎన్డీఏలో చేరితే బీజేపీ నేతలకు ఎందుకు టెన్షన్ ?

NDAలో వైసీపీ చేరుతుందన్న ప్రచారం ఏపీ బీజేపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? వాస్తవాలు ఏంటో తెలసుకోలేక కొందరు.. ఏది మైండ్ గేమో అర్థంకాక మరికొందరు అయోమయంలో ఉన్నారా? పొత్తుల ప్రచార ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలనాథులు. 

ఎన్డీయేలో వైసీపీ చేరుతుందని పెద్ద ఎత్తున ప్రచారం!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సరికొత్త వేడి రాజుకుంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు సాగుతున్న ప్రచారం.. ఏపీ బీజేపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. వైసీపీ అధినేత జగన్‌ సీఎం హోదాలో అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసినా.. ఈ దఫా భేటీ తర్వాత మొదలైన ప్రచారం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. YCP NDAలో చేరుతుందన్నదే ఆ ప్రచార సారాంశం. ఈ విషయంలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే.. ఏపీ బీజేపీ ఎటూ పాలుపోని స్థితిలో పడిందట. 

ఢిల్లీ వర్గాల దగ్గర ఆరా తీసిన ఏపీ బీజేపీ నేతలు!

ఎన్డీయేలో చేరమని బీజేపీ అధిష్ఠానం అడిగిందని.. ప్రధానితో సీఎం జగన్‌ భేటీలోను ఇదే ప్రధాన చర్చ జరిగనట్టు చెబుతున్నారు. ఇదే అంశం గతంలోనూ పార్టీ నేతల మధ్య చర్చ జరిగేది. అప్పట్లో రాష్ట్ర బీజేపీ నాయకులు అంతగా పట్టించుకోకపోయినా.. ఆ రెండు రోజులు ఏం జరుగుతుందో అర్థంకాక తల పట్టుకున్నారట. ఢిల్లీలో తమకు తెలిసిన వారి దగ్గర ఆరా తీశారట. కొందరైతే పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌తోనూ మాట్లాడారట.

కేంద్రానికి వైసీపీ దగ్గరనే ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయిందని కలవరం!

ఇదంతా వైసీపీ మైండ్‌గేమ్‌ అని.. ఆందోళన పడొద్దని ఏపీ నేతలకు చెప్పారట బీజేపీ ఇంఛార్జ్‌ దేవధర్‌. కాకపోతే ఈ ప్రచారం ప్రభావం పార్టీపైనే ఎక్కువగా ఉంటుందని నేతలు ఆందోళన చెందుతున్నారట. YCP ఎన్డీయేలో చేరినా.. చేరకున్నా.. కేంద్రానికి వైసీపీ  దగ్గర అనే మెసేజ్‌ జనంలోకి వెళ్లిపోయిందని రాష్ట్ర బీజేపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట. దీంతో ఈ ప్రభావం రాష్ట్రంలో కేడర్‌పైనా ఉంటుందని అనుకుంటున్నారు. అదీకాకుండా బీజేపీ అధిష్ఠానం దగ్గర వైసీపీకి ప్రాధాన్యం ఉందనే అభిప్రాయం అందరికీ అర్ధమైపోయిందని చెబుతున్నారట. 

వీర్రాజు వచ్చాక చేసిన ఆందోళనలు నీరుగారిపోయినట్టేనా?

ఇలాంటి స్ట్రోక్‌లతో తమ దూకుడుకు బ్రేక్‌లు పడటం ఖాయమని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. వైసీసీ మైండ్‌ గేమ్‌లో ఇరుక్కుపోయామని ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర బీజేపీ సారథిగా సోము వీర్రాజు వచ్చిన తర్వాత  వివిధ అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వరుస ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై బీజేపీది పోరాట వైఖరే అనే మూడ్‌ తీసుకొచ్చారు. కానీ.. ఇప్పుడదంతా బూడిదలో పోసిన పన్నీరన్నట్టుగా మారిపోయిందట. 

అప్పట్లో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై కేంద్రమంత్రుల ప్రశంసలు!

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీలో చోటుచేసుకున్న అంశాలను ప్రస్తావిస్తున్నారట ఏపీ నాయకులు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పోగడ్తలతో ముంచెత్తేవారు. తెలంగాణ బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై పోరాటం చేస్తుంటే.. కేంద్రమంత్రులు చేసే ప్రకటనలతో జావ గారిపోయేవారు. అలాగే మోడీ-కేసీఆర్‌కు మంచి ప్రాధాన్యమే ఇచ్చేవారు. దాంతో.. టీఆర్‌ఎస్‌కు, బీజేపీకి కేంద్ర స్థాయిలో ఏదో అవగాహన ఉందనే ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయింది. అది అల్టిమేట్‌గా ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి నష్టం చేకూర్చిందని అక్కడి బీజేపీ నాయకులు ఇప్పటికీ చెబుతుంటారు.

తెలంగాణలో ఎదురైన పరిస్థితులే ఏపీలోనూ ఉంటాయా?

నాడు తెలంగాణలో ఏం జరిగిందో.. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్‌ పునరావృతం అవుతుందేమోనని కలవరపడుతున్నారట. ఈ ప్రభావం నుంచి బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందో.. అసలు బయటపడతామో లేదో అని ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు తెగ టెన్షన్‌ పడుతున్నారట. ఇప్పుడిప్పుడే గేర్‌ అప్‌ అవుతున్న పార్టీకి తాజా పరిణామాలు డీలా పడేలా చేశాయట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.