ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. పీపీఈ సూట్స్ వేసుకుని ముట్టడి !

ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. పీపీఈ సూట్స్ వేసుకుని ముట్టడి !

తెలంగాణా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. NSUI కార్యకర్తలు పీపీఈ సూట్లు వేసుకొని ప్రగతి భవన్ కు వచ్చి మెరుపు ముట్టడి చేశారు. దీంతో NSUI కార్యకర్తలు 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకంగా NSUI ఈ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపున్చిచింది. హై కోర్ట్ పిటీషన్ పెండింగ్ ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ  NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నేడు NSUI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్బంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం చెయ్యాల్సిన కరోనా టెస్టుల గురించి పట్టింపు లేని ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలపై కూడా పట్టింపు లేదని తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ పెండింగ్ ఉన్నా ప్రభుత్వం తన నిరంకుశ మొండి వైఖరితో అనాలోచితంగా విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టే రీతిలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరిని ప్రమోట్ చెయ్యాలని అదే విధంగా కరోనా ఉధృతిని అరికట్టడానికి వెంటనే ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచాలని వారు డిమాండ్ చేశారు.