దేశంలో ఇదే తొలిసారి..! కౌలు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్..

దేశంలో ఇదే తొలిసారి..! కౌలు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్..

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులకూ రైతుభరోసా కల్పిస్తున్నామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కన్నబాబు. అర్హత ఉన్న రైతులందరికీ నేరుగా అకౌంట్లలో డబ్బు జమవుతోందని, ఈ నిర్ణయంతో సుమారు 45 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. ఇక, రైతు భరోసాను అద్భుతంగా అమలు చేస్తున్నామని తెలిపిన మంత్రి.. ఎన్నికల ముందు హామీల అమలు చేసే విధానానికి స్వస్తి పలికి.. గెలిచిన ఐదు నెలల్లోపే రైతు భరోసా అందించామన్నారు. రూ. 5185 కోట్లు రైతు భరోసాకు ఇచ్చాం... దేవాదాయ శాఖ భూములు కౌలు చేసే రైతులకు ఆ శాఖ ఇచ్చే సర్టిఫికెట్ చాలు... వాళ్లను లబ్ధిదారులుగా గుర్తిస్తామని వెల్లడించారు. ఇక, రైతు భరోసాపై సోషల్ ఆడిటింగ్ చేయిస్తామని ప్రకటించిన మంత్రి కన్నబాబు.. అనర్హులుంటే తొలగిస్తాం.. అర్హులుంటే జాబితాలో చేరుస్తామన్నారు. 

ధరల స్థిరీకరణ విషయంలో పకడ్బందీగా ఉండాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు మంత్రి కన్నబాబు.. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి.. ధరలు పెరిగిపోతున్నాయంటూ చంద్రబాబు అసందర్భ ట్వీట్లు చేస్తున్నారని... పచ్చి అబద్దాలతో చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. రూ. 3 వేల కోట్ల విలువైన వేరుశెనగ మార్కెట్లోకి రాకుండానే అంత నష్టం ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు. అలాగే మొక్కజొన్నలో రూ. 600 కోట్లు నష్టం అంటూ మరో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ మంత్రి.. మొక్కజోన్న గిట్టుబాటు కింద ఇస్తానని అధికారంలో ఉండగా చెప్పిన చంద్రబాబు.. చెల్లింపులు జరపకుండానే పదవి కొల్పోయారంటూ సెటైర్లు వేశారు. అవసరమైన మేరకు వేరు శెనగ కొనుగోలు కేంద్రాలను ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించిన కన్నబాబు.. ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతులను ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు.