నవ్వుల నారాయణ... మన ఎమ్మెస్!

నవ్వుల నారాయణ... మన ఎమ్మెస్!

నవ్వించాలంటే... ఆట్టే వంకరలు తిరిగిపోయి, పల్టీలు కొ్ట్టి, నేలపై దొర్లి ప్రయాస పడాల్సిన అవసరం లేదు. తనకున్న పర్సనాలిటీతోనే పకపకలు పంచినవారే బెస్ట్ కమెడియన్! అదే అభిప్రాయంతోనే కాబోలు, హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డుల న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే! 

నవ్వుల ప్రయాణం...

బాల్యం నుంచీ రివటలా ఉండే ఎమ్మెస్ నారాయణ తన చేష్టలతో చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండేవారు. చదువుకొనే రోజుల్లో మిత్రులకు నవ్వులు పంచారు. ఆపై నాటకాలపై మనసు పారేసుకొని నటనతోనూ ఆకట్టుకున్నారు. కొన్ని నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించి, మిత్రులతోనూ నటింపచేసి ఆనందించారు ఎమ్మెస్. చదువు పూర్తయ్యాక లెక్చరర్ గా పనిచేస్తూనే, మళ్ళీ నటనపై మనసు పారేసుకున్నారు. అదే ఆయనను సినిమా రంగంవైపు పరుగులు తీయించింది. సుమన్ హీరోగా నటించిన 'అలెగ్జాండర్'లో తొలిసారి తెరపై కనిపించారు ఎమ్మెస్ నారాయణ. అదేమి అంత గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది. తరువాత దర్శకుడు రవిరాజా పినిశెట్టితో దోస్తీ కుదిరింది. ఆయన రూపొందించిన 'ఎమ్.ధర్మరాజు ఎమ్.ఏ., పెదరాయుడు" చిత్రాలలోనూ నటించారు ఎమ్మెస్. అడపాదడపా తెరపై కనిపిస్తున్నా ఎమ్మెస్ నారాయణకు అంతగా గుర్తింపు రాలేదు. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన 'మా నాన్నకి పెళ్ళి'లో తాగుబోతుగా నటించి  భలేగా మెప్పించారు. ఆ తరువాత మరి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎమ్మెస్ నారాయణ నవ్వుల ప్రయాణం సాగించారు. ఆ పయనంలో నవ్వుల పువ్వులు పంచుతూ ముందుకు పోయారు. "మా నాన్నకి పెళ్ళి, రామసక్కనోడు, సర్దుకు పోదాం రండి, శివమణి, దూకుడు" చిత్రాలు ఆయనకు నంది అవార్డును సంపాదించి పెట్టాయి. 

పేరడీతో కామె'ఢీ'!

స్వతహాగా రచయిత కాబట్టి, ఎలాంటి మాటలు పడితే నవ్వులు పూస్తాయో ఎమ్మెస్ నారాయణకు బాగా తెలుసు. దర్శకుడు సన్నివేశం చెప్పగానే, తానే పూనుకొని మరీ కొన్ని మాటలు కలిపి, హాస్యం పంచేవారు ఎమ్మెస్. అందుకనే పలువురు దర్శకులు ఎమ్మెస్ నారాయణ తమ సినిమాల్లో ఉంటే చాలు అని భావించి మరీ ఆయనకు పాత్రలు ఇచ్చేవారు. తన దరికి చేరిన ప్రతి పాత్ర ద్వారా నవ్వులు పూయించాలనే ప్రయత్నించేవారు నారాయణ. ఏ స్టార్ హీరో సినిమాలోనైనా పంచ్ డైలాగులు మారుమోగాయనుకోండి. వాటికి పేరడీగా ఎమ్మెస్ తనదైన అభినయంతో నవ్వులు కురిపించేవారు. అందుకు 'దూకుడు' పెద్ద ఉదాహరణ. ఈ సినిమాలో మిగిలిన కమెడియన్స్ సైతం ఎంతగా అలరించినా, చివరకు ఎమ్మెస్ నారాయణ పేరడీలే జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకటా రెండా అనేక చిత్రాలలో నవ్వుల నారాయణ అభినయం జనాన్ని విశేషంగా అలరించింది. 

 ఎమ్మెస్ నారాయణ దర్శకత్వంలో "కొడుకు, భజంత్రీలు" అనే చిత్రాలు రూపొందాయి. వీటిలో 'కొడుకు' చిత్రంలో నారాయణ కుమారుడు విక్రమ్ హీరోగా నటించాడు. కొన్ని చిత్రాలకు రచన కూడా చేసిన నారాయణ, నవ్వుల తోటలోనే అధికంగా గడిపారు. కేవలం 17 సంవత్సరాలలో 700 పైచిలుకు చిత్రాలలో నటించి ఓ రికార్డు నెలకొల్పారు. ఇప్పటికీ ఎమ్మెస్ నారాయణ పేరు వినగానే ఆయన నటించిన పాత్రలే గుర్తుకు వచ్చి నవ్వులు మన సొంతమవుతాయి. నేడు ఎమ్మెస్ నారాయణ మన మధ్య లేరు. కానీ, ఆయన పంచిన నవ్వులలో నిత్యం నిలచే ఉంటారు.

(ఏప్రిల్ 16న ఎమ్.ఎస్.నారాయణ జయంతి)