తెలంగాణలో అతిపెద్ద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వచ్చిన సమస్య ఏంటి?

తెలంగాణలో అతిపెద్ద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వచ్చిన సమస్య ఏంటి?

ఆయన తెలంగాణలో అతి పెద్ద ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయనకో  పెద్ద సమస్య వచ్చి పడింది. మంత్రులు, నేతల చుట్టూ ప్రక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదు. ఇంటికెళ్లి కూర్చోవడమా? లేక పార్టీ కండువా కప్పుకోవడమా అన్నది ఆయన ముందున్న సవాల్. ఇంతకీ ఎవరానేత? ఆయనకొచ్చిన సమస్య ఏంటి?
 
ఈ నెల 30న కారం రవీందర్‌రెడ్డి ఉద్యోగ విరమణ!

లక్షల మంది ఉద్యోగులు సభ్యులుగా ఉన్న టీఎన్‌జీవో సంఘానికి ప్రెసిడెంట్ కారం రవీందర్‌ రెడ్డి. తెలంగాణలోని ఉద్యోగసంఘాల జేఏసీకి కూడా చైర్మన్ ఆయనే. దేవీ ప్రసాద్ తర్వాత టీఎన్‌జీవో అధ్యక్షుడిగా వచ్చిన కారం ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. కేబినెట్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు రెండేళ్లు పెంచుతారన్న ఆశతో ఎదురుచూశారు. ఆ ఊసే లేకపోవడంతో నిరాశ చెందారు. కేబినెట్‌కు ముందే అటు ప్రభుత్వం ఇటు పార్టీలో కీలక నేతలను కలిసి తన భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. వయోపరిమితి పెంచితే మరో రెండేళ్లు ఆయన ఈ పదవీలో  కొనసాగే అవకాశం ఉంది.

 ఇప్పటికే సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు రిటైర్మెంట్‌!

రవీందర్ రెడ్డి రెవెన్యూ శాఖలో ప్రస్తుతం సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు రిటైర్‌ అయినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటంతో  ప్రభుత్వం ఈ విషయంపై తేల్చుకోలేకపోతోంది. 
 
ఈ నెలలో వయోపరిమితి పెంచడం అసాధ్యమేనా?

టీఎన్‌జీవో అధ్యక్షులుగా చేసిన స్వామిగౌడ్, దేవీప్రసాద్ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీజీవో అధ్యక్షుడిగా పనిచేసిన స్వామిగౌడ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. రవీందర్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారన్న ముద్ర ఉంది. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లకుండా బండి నడిపిస్తూ వస్తున్నారు. ఆయన ముందు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఉద్యోగుల వయోపరిమితి పెంచితే ఎలాంటి సమస్యలేదు. ఈనెల్లో  అది దాదాపు అసాధ్యమే. కాబట్టి వ్యక్తిగతంగా రవీందర్ రెడ్డికి ఎక్స్ టెన్షన్ ఇవ్వొచ్చు. అలా చేసినా  స్వామినాథన్ కమిటీ ప్రకారం టీఎన్‌జీవో అధ్యక్షుడిగా కొనసాగే  అవకాశాలు లేవు. పైగా దీనికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దిశగా రవీందర్ రెడ్డి ఆలోచించడం లేదని సమాచారం. 
 
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పోటీ చేయమంటారా? 

రాజకీయాల్లోకి రావాలనుకుంటే రవీందర్ రెడ్డి ముందున్న ఏకంగా మార్గం టీఆర్ఎస్ కండువా కప్పుకోవడమే. ఈ విషయంలో అధిష్ఠానం ఏం ఆలోచిస్తుంది అన్నది బయటపడటం లేదు. ఒకసారి రిటైర్‌ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈనెలాఖరులోగానే ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి. త్వరలోనే వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖాళీ అవుతోంది. ఆ స్థానం నుంచి పోటీ చేయమని టీఆర్ఎస్ అడిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి పోటీచేయడమంటే పెద్ద సాహసమే అవుతుందని అనుకుంటున్నారట.  మరి.. కారం భవిష్యత్‌ ఏంటో కాలమే చెప్పాలి.