అవసరమైతే చట్టంలోనూ మార్పు-సీఎం కేసీఆర్‌

అవసరమైతే చట్టంలోనూ మార్పు-సీఎం కేసీఆర్‌

రైతులంతా ఒకే పంట వేసే విధానం మారాలని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. అవసరమైతే ప్రస్తుత చట్టంలోనూ మార్పు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఇబ్బందులు, ఇతర అంశాలపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి... సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతోందని అన్నారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంలు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు అవసరమైన విధానాలు ఖరాలు చేయాలని ఆదేశించారు.

నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మేవారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వల్ల గోదావరి, కృష్ణానదుల్లో రాబోయే రోజుల్లో దాదాపు 1300 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉందిని వివరించారు. సాగునీటి లభ్యత పెరగడంతో... దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. పంటకు మద్దతు ధర ఇచ్చే వ్యూహాన్ని ఖరారు చేయాలని  వ్యవసాయ, పౌరసరఫరాలు, రైతుబంధుసమితిలకు సూచించారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతీ గింజా కొంటామని ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు సీఎం.  ప్రజలకు బియ్యం, పప్పులు, ఆహార దినుసులు తక్కువ ధరకు అందించేలా పౌరసరఫరాల సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకోవాలని.. ఆ దిశగా  కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.