అసలు పని వదిలేసి కొత్త సెటిల్మెంట్లు చేస్తున్న తెలంగాణ పోలీసులు...?

అసలు పని వదిలేసి కొత్త సెటిల్మెంట్లు చేస్తున్న తెలంగాణ పోలీసులు...?

తెలంగాణ పోలీస్‌ శాఖలో సివిల్‌ పంచాయితీలు పెరిగిపోతున్నాయా? అసలు పని వదిలి కొసరు పనిమీద సిబ్బంది దృష్టి పెడుతున్నారా? ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రావడం లేదా? పోలీస్‌ బాస్‌ సైతం సిబ్బంది తీరుపై గుర్రుగా ఉన్నారా? 

నేతలు, ఎమ్మెల్యేల అండతో సిబ్బంది పక్కదారి!

లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షించే పోలీసుల్లో కొందరు ఈ మధ్య కాలంలో సివిల్‌ పంచాయితీలపై ఎక్కవ ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. దొంగల్ని పట్టుకుంటే గిట్టుబాటు అవడం లేదని భావించారో ఏమో.. ల్యాండ్‌ డీలింగ్స్‌ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల అండదండలతో వెనకేసుకుంటోంది భారీగానే ఉంటోంది. 

గన్‌పాయింట్‌లో సివిల్‌ తగాదాల పరిష్కారం!

పోలీసులు సివిల్‌ పంచాయితీల జోలికి వెళ్లకూడదు. వాటిని కోర్టులు చూసుకుంటాయి. కానీ..  ఇటీవల కాలంలో ఏకంగా ACP స్థాయి అధికారులు ACBకి చిక్కడం చూసిన తర్వాత సివిల్‌ పంచాయితీలపై  పోలీసులు ఏ స్థాయిలో మక్కువ పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.  అంతకుముందు ఆరోపణలు వచ్చిన వనస్థలిపురం ACPని విధుల నుంచి తప్పించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల బూమ్‌ ఉండటంతో భూ సమస్యలకు ఖాకీ మార్కు పరిష్కారం చూపిస్తున్నారు కొందరు అధికారులు. ఇలాంటి అధికారులు గన్‌పాయింట్‌లో సెటిల్‌ చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. 

సిబ్బంది తప్పులకు మాట పడుతున్న అధికారులు!

ఒక్క హైదరాబాద్‌కే ఇది పరిమితం కాలేదు. వరంగల్‌, కరీంనగర్‌ తదితర చోట్ల కూడా పోలీసుల సివిల్‌ పంచాయితీలు పెద్ద దుమారమే రేపాయి. ఈ ఘటనలు వెలుగు చూసినప్పుడు ప్రభుత్వం నుంచి అక్షింతలు తప్పడం లేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. సిబ్బంది చేస్తున్న తప్పులకు తాము మాట పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారట. అయితే ఉన్నతాధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొందరు సిబ్బంది  సివిల్‌ పంచాయితీలలో చెలరేగిపోతున్నట్టు చెబుతున్నారు. 

ప్రతిరోజూ ప్రత్యేకంగా ఆరా తీస్తోన్న డీజీపీ!

క్రమశిక్షణ మీరుతున్న ఇలాంటి సిబ్బందిని ఇక ఉపేక్షించకూడాదని నిర్ణయించుకున్నారట డీజీపీ మహేందర్‌రెడ్డి. ఆరోపణలు వస్తే అస్సలు ఊరుకోవద్దని హెచ్చరించారట. ఆ తర్వాతే రాష్ట్రంలో పలువురు సిబ్బందిపై డిపార్ట్‌మెంట్‌ పరంగా యాక్షన్లు మొదలైందని చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. ప్రతిరోజూ ఉన్నతాధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లోనూ ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారట డీజీపీ మహేందర్‌రెడ్డి. ప్రభుత్వం నుంచి మరోసారి మాట వస్తే ఇంకా కఠినంగా ఉండాల్సి వస్తుందని పోలీస్‌ బాస్‌ స్పష్టం చేస్తున్నారట. 

పోలీస్‌ బాస్‌ కన్నెర్రపై డిపార్ట్‌మెంట్‌లో చర్చ!

ఈ విషయం తెలిసినప్పటి నుంచి పోలీస్‌ బాస్‌ కోపంగా ఉన్నారనే చర్చ  జరుగుతోంది. సిబ్బంది చేస్తున్న పనులపై ఆయన గుర్రుగా ఉన్నారని.. దొంగలు, శాంతభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కన్నెర్ర చేసినట్టే.. సొంత సిబ్బందిపైనా నిప్పులు చెరుగుతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. అవినీతి, నోట్ల కట్టల రుచి మరిగిన సిబ్బంది దారికొస్తారో లేదో చూడాలి.