పారిశ్రామిక రంగం.. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయం ఇదిగో..!

పారిశ్రామిక రంగం.. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయం ఇదిగో..!

పారిశ్రామికీకరణ, పారిశ్రామిక రంగంలో తెలంగాణకు జరుగుతోన్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంపై గళమెత్తారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగంలో కేంద్రం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోందని ఆరోపించారు. నిజానికి తెలంగాణ ఒక నవజాత శిశువు వంటిది.. నూతన రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం ఆది నుంచి విస్మరించిందన్నారు. అయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే అభివృద్ధి-సంక్షేమం రెండు ప్రధానమైన అంశాలుగా భావించి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకుపోతున్నామన్న ఆయన.. రాష్ట్రాభివృద్దిలో భాగంగా పారిశ్రామిక రంగానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఎర్పడిన తొలినాళ్లలో ఉన్న విద్యుత్ సంక్షోభం నుంచి పరిశ్రమలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు.. దీంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా  టీఎస్ ఐపాస్ వంటి వినూత్నమైన, విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చి, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్ధానంగా మార్చింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణ బాట పట్టేలా కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సింగిల్ విండో అనుమతుల విధానం తీసుకొచ్చి, దాదాపు 15 వేల కంపెనీలు, రెండు లక్షల 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాల కల్పన ఇప్పటిదాకా జరిగిందని తెలిపారు. 

ఇక, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉన్నాం... విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం... అయితే సమయం, సంవత్సరాలు గడుస్తున్నవే కానీ... కేంద్రం నుంచి సానుకూల స్పందన మాత్రం రావడం లేదని విమర్శించారు కేటీఆర్.. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొంతును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు  వివిధ రంగాల్లో దక్కాల్సిన అంశాలకు సంబంధించిన వివరాలు, విభజన చట్టం హమీలను ఓసారి పరిశీలిస్తే.. 
* పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సైతం కేంద్రం తుంగలో తొక్కింది. 
* విభజన చట్టంలో తెలంగాణకు ఒక ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విద్యా సంస్ధల ఏర్పాటు లాంటి హమీలన్నింటిని గాలికి వదిలేశారు.
* కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సైతం అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
* పారిశ్రామిక అభివృద్ధికి ప్రాణాధారమైన రైల్వే నెట్‌వర్క్ ని బలోపేతం చేయాలన్న  తెలంగాణ విజ్ఞప్తులకు స్పందించని కేంద్రం.
* ఇప్పటికే 8 రైల్వే లైన్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండగా, మరో మూడు లైన్ల సర్వే పెండింగ్‌.. 4 నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలకు స్పందన కరువు.
* కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంటున్న బుల్లెట్ ట్రైన్ మరియు  హై స్పీడ్  రైల్వే నెట్వర్క్ ల్లోనూ అన్యాయం.
* బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పైన స్పష్టత ఇచ్చి, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరినా కేంద్రం నుంచి స్పందన కరువు.
* రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందే హైదరాబాద్ నగరానికి దక్కిన ఐటీఐఆర్ ను సైతం రద్దు చేయడం. తద్వారా ఐటి పరిశ్రమ వృద్దిని అడ్డుకునే ప్రయత్నం.
* ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇక్కడ ఉన్న రెండు ఈఎంసీలకు మంచి స్పందన నేపథ్యంలో.... అదనపు  ఈఏంసీని ఏర్పాటు చేయాలని కోరినా తేల్చని కేంద్రం.
* ఆత్మ నిర్మర్ భారత్ లాంటి నినాదాన్ని ఎత్తుకున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు దొరకడం లేదు. ఫార్మా సిటీ మౌలిక వసతుల కోసం 3900 కోట్లు రూపాయలు ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందనలేదు.
* ఫార్మా సిటీకి సాయం చేయకపోగా.... ఫార్మా పార్కు స్కీం అంటు ఒక కొత్తదాన్ని తెచ్చి, చాటలో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు ఏడాది కాలంగా 19 రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి అనవసర కాలయాపన చేస్తున్నారు.
* ప్రపంచ వ్యాక్సీన్లలో మూడోవంతు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా సంక్షోభం వచ్చినప్పుడు ప్రపంచానికి అవసరమైన హైడ్రాక్సీ-క్లోరోక్విన్, రెండెస్విర్ వంటి మందులను అందించింది మన హైదరాబాద్ ఫార్మా మరియు లైప్ సైన్సెస్ పరిశ్రమనే. ఇవాళ దేశానికే కాదు, ప్రపంచానికి అవసరమైన కోవిడ్ వ్యాక్సీన్లను అందిస్తోంది హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ.
* దేశ విదేశాల నుంచి రాయబారులు వచ్చి జీనోమ్ వ్యాలీ ప్రాధాన్యతను గుర్తింస్తుంటే... కేంద్రం వైపు నుంచి మాత్రం ఇక్కడి పరిశ్రమకు కావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహం ఇప్పటిదాకా లభించలేదు. దురదృష్టం ఏమిటంటే జినోమ్ వ్యాలీలో లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉంటే, వ్యాక్సీన్ టెస్టింగ్ కోసం వందల కీలోమీటర్ల దూరంలోని కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీకి వెళ్లాలి. ఇక్కడే టెస్టింగ్ కేంద్రం నెలకొల్పాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా  కేంద్రం వాటిని ఖాతరు చేయడం లేదు. 
* హైదరాబాదులో అద్భుతమైన ఎరోస్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టం ఉన్నా కూడా కేంద్రం తలపెట్టిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లలో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. ఏలాంటి ఈకో సిస్టం లేని ఉత్తరప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్ కారిడార్ మంజూరు చేసి  పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమ అవసరాలకన్నా, పాలిటిక్స్ కే ప్రాధాన్యత ఇచ్చింది. అన్ని అవకాశాలు ఉన్న తెలంగాణకు మాత్రం డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వాలన్న విజ్ఞప్తులు మాత్రం పట్టడంలేదు.
* డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పరిశ్రమలో రిసెర్చ్ మరియు ఇన్నోవేషన్ ను పెంచేందుకు ఒక డిఫెన్స్ ఇంకుబేటర్ మరియు సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ మంజూరు చేయాలని అడిగినా స్పందన కరువు. 
* కేంద్రం ప్రకటించిన మెగా క్లస్టర్ పాలసీలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సాయం అందించమని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలదు.. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అయిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి మొండిచెయ్యే.
* దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ టెక్స్టైల్ పార్క్ కి ప్రత్యేక ఆర్థిక సహాయం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేసిన ఒక్క రూపాయి సైతం కేంద్రం నుంచి దక్కలేదు.
* 90 శాతానికి పైగా రాష్ట్రంలోని మరమగ్గాలు ఉండి, వేలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా.. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు హ్యాండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయమని అడిగినా స్పందనలేదు.
* అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, సీ పొర్టు సౌకర్యం లేని తెలంగాణకు ప్రత్యేకంగా ఒక డ్రై పోర్టు ఇవ్వాలని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదు. ఎలాంటి సముద్రతీరం లేకుండానే తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తుల వృద్ధిరేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నది. 2019-20 సంవత్సరంతో పోల్చుకుంటే 2020-2021 సంవత్సరానికి సంబంధించి సుమారు 15.5 శాతంతో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన రీతిలో ఎగుమతుల వృద్ధిరేటును నమోదు చేసింది. దేశ ఎగుమతుల్లో ఇంత కీలకమైన పాత్ర వహిస్తున్నా... తెలంగాణకి డ్రై పొర్ట్ విషయంలో నిరాశే ఎదురైంది
* నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన 23 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు దక్కలేదు. 
* ఫార్మాసిటీలో బల్క్ డ్రగ్ పార్క్, సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైస్ పార్క్ లకు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ నుంచి దక్కింది శూన్యం.
* రంగారెడ్డి జిల్లా మంకాల్ లో ప్లాస్టిక్ పార్క్ కు కేంద్ర పెట్రో కెమికల్స్ శాఖ ఇచ్చింది ఏమీ లేదు
* స్టేషన్ ఘన్ పూర్ లో లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తున్నా కేంద్రం నుంచి ఏలాంటి ప్రత్యేక సహాయం రాలేదు.
* జహీరాబాద్ నిమ్జ్ హోదా ఇచ్చినా,  మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు ఇవ్వాలని కోరిన ఒక్క అణా పైసా ఇవ్వలేదు. ఇలా ఎన్నో ప్రాజెక్టులకు సాయం కోరినా, కేంద్రం నుండి ఉలుకూ పలుకూ లేదు.