ఎన్నికల తరువాత వాటర్ బిల్లుల వసూలు రద్దు... 

ఎన్నికల తరువాత వాటర్ బిల్లుల వసూలు రద్దు... 

గ్రేటర్ ప్రచారంలో భాగంగా ఈరోజు తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆర్సీ పురం డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.  తెరాస ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు.  జీహెచ్ఎంసి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ డిసెంబర్ నెల నుంచి అమలు జరుగుతుందని, డిసెంబర్ నుంచి వాటర్ బిల్లుల వసూలు రద్దు ఉంటుందని అన్నారు.  అదేవిధంగా కోవిడ్ కారణంగా మధ్య తరగతి ప్రజలు కష్టాలను అర్థం చేసుకున్న తెరాస ప్రభుత్వం ప్రాపర్టీ టాక్స్ లో 50 శాతం తగ్గించిందని తెలిపారు.  ప్రజలు ఆలోచన చేయాలనీ, అభివృద్ధి చేసే తెరాస బిడ్డలకు ఓటు వేయాలని అన్నారు.  బీజేపీ నేతలు మేం హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తుంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేం స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేమని అంటున్నారని అన్నారు.  

ఇలా ప్రజలను మభ్యపెడుతూ పూట గడుపుతున్న పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు.  విజ్ఞానవంతులైన  ప్రజలు ఆలోచన చేయాలని తెలిపారు.  కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. వరద‌సాయం ఆరు లక్షల అరవై వేల కుటుంబాలకి రూ.660 కోట్లు  ఇచ్చినట్టు హరీష్ రావు పేర్కొన్నారు.  మిగిలినవారికి కూడా వరదసాయం అందిస్తామని అన్నారు.  ఎన్నికల కోడ్ కారణంగా వరద సాయం ఆపాల్సి వచ్చిందని, ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం వల్ల ఆగాల్సి వచ్చిందని అన్నారు.  బెంగుళూరు, ‌చైన్నై నగరాల్లో వరదలొస్తే కేంద్రం‌ ఆదుకుంది. కాని హైదరాబాద్ లో వరదలొస్తే రూపాయి సాయం చేయలేదని అన్నారు. కరోనా వస్తే ఏ పార్టీ నేతలు‌  బయటకు రాలేదని, మేం కరోనా బాధితులకు‌ అండగా ఉన్నామని అన్నారు.