రైతులు విరమిస్తామన్నాకేంద్రం వద్ద సమాధానం లేదు..!

రైతులు విరమిస్తామన్నాకేంద్రం వద్ద సమాధానం లేదు..!

ఓ వైపు రాత పూర్వకంగా హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని రైతులు చెబుతుంటే కేంద్రం దగ్గర సమాధానమే లేదని మండిపడ్డారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు... సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్నితెచ్చి కార్పోరేట్ కు అనుకూలంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 99 వేల ట్రాక్టర్లలో రైతులు ఢీల్లీకి కదిలివచ్చి సమ్మె చేస్తూ నిరసన తెలియజేస్తుంటే... కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనను అణిచివేసే ప్రయత్నంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పటికే ఐదుగురు రైతులు మృతిచెందారు.. వీరిలో ముగ్గురు ఆందోళనలో, మరో ఇద్దరు చలి తీవ్రతతో మృతిచెందారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పిలిచి రాత పూర్వకంగా రాసిస్తే సమ్మె విరమిస్తామని రైతులు తెలిపితే.. అసలు కేంద్రం వద్ద సమాధానమే లేదని మండిపడ్డారు హరీష్‌రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా కరెంటు సరఫరా చేస్తూ.. రైతులు పండించిన ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తామంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చి రైతులను అణిచి వేయాలని చూస్తోందని.. బీజేపీ నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తుందన్నారు.