తెలంగాణపై షర్మిల, పవన్‌ ఫోకస్..! ఇలా స్పందించిన మంత్రి గంగుల

తెలంగాణపై షర్మిల, పవన్‌ ఫోకస్..! ఇలా స్పందించిన మంత్రి గంగుల

తెలంగాణలో త్వరలోనే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. దాని కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్ఆర్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. రిటైర్డ్ అధికారులు, ఇతర ప్రముఖులు కూడా వచ్చి షర్మిలను కలిసి వెళ్తున్నారు. తాజాగా.. తెలంగాణలోనూ జనసేన పార్టీని విస్తరించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు.. హైదరాబాద్‌లో జరిగిన జనసేన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పురుడు పోసుకుంది హైదరాబాద్‌లోనే.. తొలి ఎంపీటీసీ గెలిచింది కూడా తెలంగాణలోనే అని గుర్తు చేసుకున్నారు. దీంతో.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైఎస్ షర్మిల, పవన్ కల్యాణ్ ప్రయత్నాలపై స్పందించారు మంత్రి గంగుల కమలాకర్‌. 

తెలంగాణలో వేరే పార్టీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు మంత్రి గంగుల... 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేసిన ఆయన.. కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారన్నారు.. ఎక్కడ సంపద ఉంటె.. అక్కడ దోచుకోవడానికి పార్టీలు పెడతారని ఎద్దేవా చేసిన ఆయన... తెలంగాణ కేసీఆర్ సంపద సృష్టించారు.. ఇప్పుడు ఆంధ్రవాళ్లు పార్టీలు పెడతామంటున్నారు అని ఫైర్ అయ్యారు. ఇక, ఆ కొత్త పార్టీలను ప్రజలను సినిమాను చూసినట్టుగానే చూస్తారు తప్ప.. ఇంకా ఏమీ జరగదని కామెంట్ చేశారు మంత్రి గంగుల. మొత్తంగా.. వైఎస్ షర్మిల కొత్త పార్టీతో పాటు... పవన్ కల్యాణ్ తాజాగా చేసిన కామెంట్లు పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.