PRC పై తెలంగాణ ఉద్యోగులకు శకునం బాగాలేదా?

PRC పై తెలంగాణ ఉద్యోగులకు శకునం బాగాలేదా?

శకునం బాగోలేదా... టైమ్‌ బ్యాడా? ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల్లో జరుగుతున్న చర్చ ఇదే.  ఉద్యోగులు వేస్తున్న ప్రశ్నలకు ఉద్యోగ సంఘాల నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. పీఆర్సీ సంగతి చూస్తే.. రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. దీంతో ఎవరిని కదిపినా.. ఏం చేస్తాం.. లక్‌ అలా తగలడింది అని ఉసూరుమంటున్నారు.

వేతన సవరణ ఇప్పట్లో తేలదా? 

ఓకే అంశం.. వాయిదాపై వాయిదా పడుతూ ఉంటే... పాత అప్పులోళ్ల పంచాయితీ అంటారు. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే మారిందట. సంక్రాంతికి పీఆర్సీ అని ప్రభుత్వం మాట ఇచ్చింది. సంక్రాంతి పోయి ఉగాది వచ్చేలా ఉంది. క్యాలెండర్‌లో పేజీలు మారుతున్నాయి కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఉద్యోగులతో సంప్రదింపుల కమిటీ సమావేశం అవుతున్నా ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు. కాలగర్భంలో రోజులు.. నెలలు కలిసిపోతున్నాయి. వేతన సవరణ ఎంతో ఊహకందదు. ప్రమోషన్లు అతీగతీ లేవు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో కోడ్‌ అమలులోకి వచ్చేసింది. 

వరుస ఎన్నికలతో నిర్ణయం మళ్లీ వాయిదా పడుతుందా? 

ఇది ఎన్నికల సమయం కావడంతో PRCపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు తక్కువే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో వాటిపై ఉద్యోగుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందుకే పీఆర్సీపై నిర్ణయం తీసుకోబోరని కొందరు చెబుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు వస్తే.. వేతన సవరణ అంశం మళ్లీ వాయిదా పడే ప్రమాదం ఉంది. ఈ  విషయాలనే దగ్గర పెట్టుకుని వేతన సవరణపై ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని ఉద్యోగులు పేపర్లపై లెక్కలు వేసుకుంటున్నారు. 

ఉద్యోగ సంఘాల నేతలకు తలబొప్పి కడుతోందా? 

తమకు ఎదురైన ఈ చేదు అనుభవాలను తలచుకుని.. ప్రభుత్వ జూనియర్  లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. తలపై తుండు కప్పుకొని ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది... ఇక prc.. ప్రమోషన్‌లు  అంతే సంగతులు... నెత్తిన గుడ్డే..! అనే అర్థం వచ్చేలా నిరసన ఫోటో పెట్టారు. మిగతా ఉద్యోగ సంఘాలకు సైతం తలబొప్పి కడుతోందట.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా రియాక్ట్‌ అవుతారో?

ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని tngo.. tgo నాయకులపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వేతన సవరణ వాయిదాలపై వాయిదా పడుతుంటే మరింత ఇరకాటంలో పడుతున్నారు. ఇదంతా ముందే ఊహించామని చెబుతున్నారు టీఎన్జీవోని వ్యతిరేకిస్తున్న ఐక్య వేదిక నాయకులు. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా రియాక్ట్‌ అవుతారో తెలియని పరిస్థితి. అందుకే ఎవరిని కదిపినా టైమ్‌ బ్యాడ్‌ ఏం చేస్తాం అని పెదవి విరుస్తున్నారట. మరి.. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు టర్న్‌ తీసుకుంటాయో చూడాలి.