పాదయాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు ఎందుకు వెనక్కి తగ్గారు?

పాదయాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు ఎందుకు వెనక్కి తగ్గారు?

మేము సైతం అన్నారు. పాదయాత్రలకు రెడీ అన్నారు. షెడ్యూలూ ప్రకటించారు. రూట్‌ మ్యాపూ ఫిక్స్‌ చేసుకున్నారు. తీరా గడువు దగ్గర పడేసరికి వాయిదా వేసుకున్నారు. ఊరించి..ఊరించి.. ఎందుకు ఉసూరుమనించారు ? ఒక్కడే కాదు..అందరూ యాత్రలోనే ఉంటారు అని చెప్పిన నేతలు.. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గినట్లు ! అసలు హస్తం నేతల యాత్రలు వాయిదా పడటానికి కారణాలేంటి ?

తెలంగాణ కాంగ్రెస్‌లో పోటాపోటీ పాదయాత్రలకు నాయకులంతా సిద్దమయ్యారు. అచ్చంపేట నుండి రేవంత్ పాదయాత్ర ప్రారంభించాక.. పార్టీలో సీనియర్ నాయకులు కూడా యాత్రలు చేస్తామంటూ రెడీ అయ్యారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి.. తాము పాదయాత్ర చేస్తున్నాం అని ప్రకటించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. పాదయాత్రలతో సీనియర్‌ నేతలు కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకున్నారు. విడివిడిగా యాత్రలు చేసినా.. నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్‌కు కాస్త ఊపొస్తుందని ఊహించారు.

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల కోమటిరెడ్డి సొంత గ్రామం. బ్రాహ్మణవెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ కి 100 కోట్లు కేటాయిస్తే.. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవి. దీనికి తోడు SLBC  టన్నెల్ పనుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. బ్రాహ్మణవెల్లంల నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు కోమటిరెడ్డి. శనివారం నుండే పాదయాత్ర ప్రారంభిస్తున్నటు ప్రకటించారు. కానీ తీరా ఇప్పుడు వాయిదా వేసుకున్నారు. జిల్లా పోలీసులు.. 25 మందితో మాత్రమే పాదయాత్ర చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారట. కానీ 25 మందితో యాత్ర చేయడం ఏంటి..? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ఉండటంతో పోలీసులు ఎక్కువమందికి అనుమతి ఇవ్వలేదట. అయితే పర్మిషన్‌ ఇచ్చిన 25 మందితో యాత్ర చేయలా లేక తాను అనుకున్నట్లు భారీగా యాత్రను కొనసాగించాలా అని ఆలోచించిన కోమటిరెడ్డి.. చివరకు యాత్రను వాయిదా వేయాలనే నిర్ణయించుకున్నారు. కానీ అనుమతి ఇచ్చినంత మందితోనే  యాత్రను మొదలుపెడితే బాగుండేదని కాంగ్రెస్‌ వర్గాలు అనుకుంటున్నాయట.  గ్రామాల వారీగా జనం వచ్చి యాడ్ అయితే... సరిపోతుంది కదా అనే టాక్ కూడా ఉంది.

మరో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి... ఈ నెల 22 నుండి పాదయాత్ర చేయడానికి సిద్దమయ్యారు. సదాశివపేటలో యాత్ర మొదలుపెట్టి.. గన్ పార్క్ దగ్గర ముగించాలని నిర్ణయించుకున్నారు. కానీ జగ్గారెడ్డి పాదయాత్ర కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం  జరిగేట్టు లేదు. జగ్గారెడ్డికి యాత్ర చేయాలని ఉన్నా.. ఆయనకు కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాదయాత్ర చేస్తే ఓ రేంజ్ లో ఉండాలి కానీ... నడిచామా అంటే నడించాము అనేలా ఉండొద్దనేది జగ్గారెడ్డి ఆలోచన. అందుకే పాదయాత్రను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారట. కానీ చెప్పిన సమయానికి పాదయాత్ర చేయకపోవడంతో క్యాడర్ కొంత నారాజ్ అయినట్లు సమాచారం.

ఇప్పటికే రెండు సార్లు యాత్ర వాయిదా వేసుకున్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో భారీ సభ అనుకున్నారు.. అదీ వాయిదా పడింది. చాలా కాలంగా జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద, తన నియోజకవర్గ సమస్యలపై ఆందోళన బాట పట్టాలని అనుకున్నారు. అయితే కార్యాచరణ ఎప్పుడు, ఎలా అమలు చేస్తారనే దానిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి.. ఇద్దరూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలే. ఇద్దరూ  మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకులే. కానీ, యాత్రలు అంటూ ప్రకటించి.. ఇప్పుడు వాయిదా వేసుకోవడం కాంగ్రెస్‌ కేడర్‌ను నిరాశపరుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల దగ్గర ఇదే మైనస్. ఒకరు చేస్తుంటే ఇంకొకరు రెడీ అంటారు. కానీ తీరా సమయం దగ్గర పడ్డాక... సైలెంట్ అవుతారని ప్రజలు అనుకుంటున్నారు.